ఆసియా కప్ లో భారత బౌలింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్ 4 మ్యాచుల్లో బౌలింగ్ దళం తన స్కోరును కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. అయితే, ఇప్పుడు కళ్లన్నీ రానున్న టీ20 ప్రపంచకప్ మీదే. ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ఈ టోర్నీకి అత్యుత్తమ బౌలింగ్ దళం కావాలి. మరి టీమిండియా ప్రస్తుత పరిస్థితి ఏంటి? కంగారూల పిచ్ లపై మన బౌన్స్ ప్రభావమెలా ఉండబోతోందనేది చర్చనీయాంశం.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ త్రయం టీమిండియా బౌలింగ్ కు వెన్నెముక. ప్రత్యర్థి బ్యాటర్లకు వీరి స్పెల్ సవాలు విసురుతుంది. ధాటిగా ఆడాలంటే ఏ బ్యాట్స్ మన్ అయినా ఆలోచించాల్సిందే. భువి ఇన్ అండ్ ఔట్ స్వింగులు, బుమ్రా యార్కర్, స్లో పిచ్ బంతులు, షమి షాట్ పిచ్ బంతులు ప్రత్యర్థిని ఇరకాటంలో పడేస్తాయి. కానీ, వీరు ముగ్గురూ కలిసి జట్టులో ఆడక చాలా రోజులైంది. హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ వంటి ప్రత్యామ్నాయాలున్నా పేస్ విభాగం బలంగా కనిపించకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది.
షమీ రావాల్సిందేనా..?
టీ20ప్రపంచకప్ జట్టులో షమీకి స్థానం కల్పించాల్సిందేనన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆసియా కప్ లో ఈ సీనియర్ బౌలర్ ని పక్కనపెట్టడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ కె.శ్రీకాంత్ వంటి వారు షమీకి చోటు కల్పించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీ20 ఫార్మాట్ కు షమీ సెట్ కాడని సెలక్టర్లు పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. కానీ గణాంకాలు చూస్తే షమీ పర్ఫార్మెన్స్ తీసికట్టుగా లేదు. ఆసియా కప్ కు ముందు జరిగిన ఐపీఎల్ లో ఈ సీనియర్ బౌలర్ గుజరాత్ టైటాన్స్ కి ప్రాతినిథ్యం వహించాడు. జట్టు బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాడు. 16మ్యాచుల్లో 20 వికెట్లతో టైటాన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. పైగా అంతర్జాతీయ టోర్నీల్లో ఆడిన అనుభవం షమీకి కలిసొస్తుంది. ఈ సారి సెలక్టర్ల కంట పడతాడో లేదో చూడాలి మరి!
బుమ్రా డౌటేనా..?
యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాను ఫిట్ నెస్ సమస్య వెంటాడుతోంది. వెన్నెముక గాయంతో జులైలో ఇంగ్లాండ్ టూర్ నుంచి ఈ స్టార్ పేసర్ నిష్క్రమించాడు. ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదు. దీంతో సెలక్షన్ కమిటీ బుమ్రాను ఫిట్ నెస్ పరీక్షలకు పిలిచింది. బుమ్రా ఫిట్ గా ఉన్నాడని తేలితే బౌలింగ్ దళం పటిష్ఠంగా మారనుంది. బుమ్రాతో పాటు హర్షల్ కూడా ఫిట్ నెస్ నిరూపణకు జాతీయ క్రికెట్ అకాడమీకి రానున్నాడు. హర్షల్.. బుమ్రాతో జత కలిస్తే టీమిండియాకు అదనపు బలం చేకూరినట్లే.
భువీకి ఏమైంది..?
కొత్త బంతితో ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్ లతో బ్యాట్స్ మన్ ను తికమకపెట్టే పేసర్ భువనేశ్వర్ కుమార్. డెత్ ఓవర్లలో ఈ బౌలర్ కి మంచి పేరుంది. కానీ గత కొద్ది కాలంగా అంచనాలను అందుకోలేకపోతున్నాడు. బంతి పాతబడితే ఇతగాడి పేస్ పదును తేలిపోతోంది. ఆసియా కప్ లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. తొలి స్పెల్ కట్టుదిట్టంగా బంతులేస్తే.. డెత్ ఓవర్లలో తేలిపోయాడు. ధారాళంగా పరుగులిచ్చి టీమిండియాకు ఓటమిని మిగిల్చాడు. అఫ్గాన్ తో మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన చేసినా.. అది తన స్థాయి ఆట కాదు. అతడి సీనియారిటీ జట్టుకు పరిపూర్ణత్వం తీసుకురావాలి. మరి భువి ఆస్ట్రేలియాపై ఎలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే.
పెద్దన్నగా హార్దిక్ పాండ్యా
అటు బౌలింగ్ కు, ఇటు బ్యాటింగ్ కు అండగా ఉంటూ టీమిండియాకు పెద్దన్నగా నిలుస్తున్నాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్ లో ఆల్ రౌండర్ గా, కెప్టెన్ గా రాణించి టీమిండియాలో చోటు సంపాదించాడు. ఇక అప్పటినుంచి తిరిగి చూసుకోలేదు. ఉత్తమ ప్రదర్శనతో టీమిండియాకు విజయాలను అందించాడు. కీలక సమయాల్లో వికెట్లను తీస్తూ బౌలింగ్ దళానికి బాసటగా నిలిచాడు. ఫినిషర్ గానూ జట్టుకు ఉపయోగపడుతున్నాడు. పేస్ పిచ్ లపై హార్దిక్ అవసరం ఎంతైనా ఉంది. కచ్చితంగా జట్టుకు సమతూకం తీసుకురావడంలో హార్దిక్ ముందుంటాడు.
హర్షల్ పటేల్ కి అవకాశం..
హర్షల్ పటేల్ డెత్ ఓవర్ల స్పెషలిస్టు. ఐపీఎల్ లో బెంగుళూరు తరఫున బాగా రాణించాడు. ప్రస్తుతం ఎన్సీఏలో చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నాడు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్ లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక అవేశ్ ఖాన్ తన ప్రదర్శన చాటుకోలేకపోయాడు. అర్షదీప్ బాగానే రాణించినా ఆస్ట్రేలియా బస్సు ఎక్కకపోవచ్చు.
పేస్ పదునెక్కుతుందా..!
ప్రత్యర్థి జట్లు బలంగా దూసుకెళ్తున్న సమయంలో భారత్ పేస్ పదును తగ్గిపోవడం ఆందోళన కలిగించేదే. టీమిండియా జట్టును 16న ప్రకటించే అవకాశం ఉంది. పేస్ పిచ్ లు కావడంతో ఒక పేసర్ ను జట్టులోకి అదనంగా తీసుకోవచ్చు. ఈ మెగా టోర్నీలో భువి, బుమ్రా/షమి, హర్షల్, అర్షదీప్, హార్దిక్ పాండ్యా బౌలింగ్ దళాన్ని ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరం.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి