పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తన నటన, మంచితనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నటుడిగా గుర్తింపు సంపాదించాడు. సినిమా హీరోగా ప్రభాస్ సృష్టించిన రికార్డులు ఏ కథానాయకుడికి సాధ్యంకాదని చెప్పవచ్చు. ఇవాళ (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టిన రోజు. 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అతడి వ్యక్తిగత, ఫిల్మ్ కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు మీకోసం.
చదువులో యావరేజ్
ప్రభాస్ చదువు పరంగా యావరేజ్ స్టూడెంట్. తరగతిలో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవాడు కాదట. డ్రిల్ పిరియడ్ కోసం తెగ ఎదురుచూసేవాడట. క్లాస్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆటలు ఆడేవాడు.
మతిమరుపు ఎక్కువ
ప్రభాస్‌కు కాస్త మతిమరుపు ఉంది. అందుకే స్కూల్ డేస్ నుంచి తన ఫ్రెండ్స్ గజినీలా చూసేవారని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలిపాడు. పరీక్షలకు పెన్ను మర్చిపోయి హాజరయ్యేవాడినని చెప్పుకొచ్చాడు. పుస్తకం ఒక చోట పెట్టి మరో దగ్గర వెతికేవాడినని తెలిపాడు. చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగైనట్లు స్పష్టం చేశాడు.
‘నువ్వు హీరో ఏంట్రా’
కెరీర్ ప్రారంభంలో సినిమా హీరో అవుతా అని ప్రభాస్ తన స్నేహిడితో చెప్పాడట. అప్పుడు అతడు పెద్దగా నవ్వి ‘నువ్వు హీరో ఏంట్రా బాబూ’ అని సమాధానం ఇచ్చాడట. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా వారు తొలుత షాకై తర్వాత వైజాగ్‌లోని సత్యానంద్ దగ్గర శిక్షణకు పంపించారు. మూడు నెలల ట్రైనింగ్ తీసుకున్నాక ‘ఈశ్వర్’ ఆఫర్ వచ్చింది.
డార్లింగ్ పిలుపుకు కారణం ఇదే
ప్రభాస్ నోట తరుచూ డార్లింగ్ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. స్నేహితులను, బాగా దగ్గరైన వారిని డార్లింగ్ అంటూ అతడు సంబోధిస్తుంటాడు. డార్లింగ్ అని పిలవడానికి గల కారణాన్ని ప్రభాస్ ఓ సందర్భంలో తెలియజేశాడు. ఎవరినైనా బ్రదర్, అన్నా అని పిలవాలంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. అందుకే డార్లింగ్ అని పిలుస్తుంటానని చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన దర్శకుడు పూరి జగన్నాథ్ ‘బుజ్జిగాడు’ సినిమాతో ఈ పదాన్ని మరింత పాపులర్ చేశాడు. అదే పేరుతో డార్లింగ్ సినిమా కూడా రావడం గమనార్హం.
అతిథి పాత్రలు
రెబల్ స్టార్ ప్రభాస్ హిందీలో వచ్చిన ‘యాక్షన్ జాక్సన్’ (2014) సినిమాలో గెస్ట్‌రోల్‌లో కనిపించాడు. అజయ్ దేవ్గన్ హీరోగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వచ్చే ‘పంజాబీ మస్త్’ అనే పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి ప్రభాస్ డ్యాన్స్ చేశాడు. మళ్లీ దశాబ్దకాలం తర్వాత కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ‘దేనికైనా రెడీ’ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
పెదనాన్నతో రెండు చిత్రాలు
దివంగత నటుడు కృష్ణం రాజు (Krishnam Raju) ప్రభాస్‌కు పెద్దనాన్న అవుతారు. కృష్ణం రాజు నట వారసుడిగానే ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. పెదనాన్న అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రాణం. ఆయనతో కలిసి ‘బిల్లా’, ‘రెబల్’ వంటి చిత్రాల్లో ప్రభాస్ నటించారు. ఆ రెండు చిత్రాలు ఎన్నో మధురానుభూతులను అందించాయని ప్రభాస్ చెబుతుంటాడు.
ముచ్చటగా మూడుసార్లు
ప్రభాస్ తన కెరీర్లో ఇద్దరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశాడు. త్రిష (Trisha), అనుష్క (Anushka) లతో కలిసి మూడేసి చిత్రాల చొప్పున స్క్రీన్ పంచుకున్నాడు. త్రిషతో ‘బుజ్జిగాడు’, ‘వర్షం’, ‘పౌర్ణమి’ చిత్రాలు చేశాడు. అనుష్కతో ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’లో నటించాడు.
తొలి దక్షిణాది హీరో
ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో (బాహుబలి గెటప్పు) మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్ గుర్తింపు పొందాడు. ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్, రీసెంట్గా రామ్‌చరణ్ ఈ ఘనత సాధించారు.
నటుడు కాకుంటే..
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో వర్క్ చేయడం తన డ్రీమ్ అని ప్రభాస్ ఓ సందదర్భంలో తెలియజేశాడు. ఒకవేళ తాను నటుడి కాకపోయుంటే హోటల్ రంగంలో స్థిరపడేవాడినని చెప్పుకొచ్చాడు.