తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన గురువారం (అక్టోబర్ 3) రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే రజనీ అనారోగ్యానికి కూలి షూటింగ్‌కు ముడిపెడుతూ కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. షూటింగ్ ఒత్తిడి వల్లే ఆయన ఆరోగ్యం చెడిపోయిందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీనిపై కూలి సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా పలు యూట్యూబ్ ఛానల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
‘రజనీ కంటే షూటింగ్ ముఖ్యం కాదు’
రజనీకాంత్ ఆరోగ్యం విషయంలో కూలి చిత్ర బృందాన్ని తప్పుబడుతూ చక్కర్లు కొడుతున్న వార్తలపై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. అలాంటి ప్రచారాలు చూస్తుంటే బాధగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ‘దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్ షెడ్యూల్‌లో తన ఆరోగ్యం గురించి రజనీకాంత్ మాతో చెప్పారు. తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన షూటింగ్ పోర్షన్ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్ మాకు ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా విషయంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఇలాంటి వార్తలు రాయండి అని కోరుతున్నా’ అని లోకేశ్ కనగరాజ్ మండిపడ్డారు. అక్టోబర్ 15 తర్వాత రజనీకాంత్ తిరిగి సెట్‌లోకి అడుగుపెడతారని ఆయన స్పష్టం చేశారు.
రజనీ అనారోగ్య సమస్య ఏంటంటే?
రజనీకాంత్ ఆరోగ్యం విషయానికి వస్తే సెప్టెంబర్ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని గురువారం రాత్రి డిశ్చార్జ్ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
కూలీలో స్టార్ క్యాస్ట్!
రజనీకాంత్ 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి వరుస హిట్స్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్ 1421’ దేవాగా రజనీకాంత్ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్ పాత్ర చేస్తున్నాడు. సైమన్ అనే క్రూయల్ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి పాపులర్ నటులు ఈ బిగ్ ప్రాజెక్టులో భాగమయ్యారు.
సైమన్ యాక్షన్ సీన్ లీక్
రజనికాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ స్పెషల్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ పోషిస్తున్న సైమన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్ గతంలో రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే షూటింగ్‌లో నాగార్జునకు సంబంధించిన వైలెంట్ సీన్ ఇటీవల లీకయ్యింది. ఇందులో నాగ్ రూత్ లెస్‌గా కనిపించాడు. రోలెక్స్ (విక్రమ్ సినిమాలో సూర్య పాత్ర) తరహాలో చాలా క్రూరంగా కనిపించాడు. ఓ వ్యక్తిని కొట్టి కొట్టి చంపేస్తున్నాడు. తమిళ్‌లో డైలాగ్ కూడా చెప్పాడు. ఈ క్లిప్ క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగార్జునను ఇంత వైలెంట్‌గా ఎప్పుడు చూడలేదని కామెంట్స్ చేశారు..
లోకేష్‌పై పవన్ ప్రశంసలు
కోలీవుడ్‌లో తనకు ఇష్టమైన దర్శకుడి గురించి పవన్ కల్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దర్శకుల విషయానికి వస్తే తనకు మణిరత్నం (Maniratnam) అంటే చాలా ఇష్టమని పవన్ అన్నారు. ప్రస్తుత దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఫిల్మ్ మేకింగ్ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లియో’, ‘విక్రమ్’ సినిమాలు తాను చూశానని అన్నారు. అవి తనకు బాగా నచ్చాయని ప్రశంసించారు. పవన్ వంటి స్టార్ హీరో తనను మెచ్చుకోవడంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. ‘మీ నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో ఆనందంగా గౌరవంగా ఉంది సర్. నా వర్క్ మీకు నచ్చడం ఎంతో గ్రేట్‌గా ఆహ్లదంగా అనిపిస్తుంది. మీకు నా కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.