టాలీవుడ్‌లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో ‘నివేదా పేతురాజ్‘. మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్‌లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు ఏం జరిగిందంటే?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. ‘రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్ చేయలేను’ అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
నివేదా ప్రాంక్ చేసిందా?
నివేదా పేతురాజ్ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్‌గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్‌గా లేదని.. స్క్రిప్టెడ్‌లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్‌కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.
సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు
కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ – నివేదా పేతురాజ్‌కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్ పడింది.
విష్వక్‌తో హ్యాట్రిక్ చిత్రాలు
తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్ మదిలో’ తర్వాత నివేదా.. ‘చిత్రలహరి‘తో మరో హిట్ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన ‘బ్రోచేవారెవరురా‘ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది.