మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అమెరికా బయలుదేరాడు. ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అగ్రరాజ్యానికి పయనమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్, డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కూడా విమానం ఎక్కనున్నట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డుకు పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని భారత ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన ఘనత డైరెక్టర్ రాజమౌళికే చెందుతుంది.
ట్రెండ్ మారుతోంది
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మూవీగా పరిగణించేవారు. హిందీ చిత్రాలే దేశవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించేవి. దక్షిణాది చిత్రాలకు తగిన గుర్తింపు ఉండేది కాదు. అయితే, కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్ స్థాయి విశ్వవ్యాప్తమైంది. దేశంలోని ప్రతి ఇండస్ట్రీలోనూ ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్లను వసూలు చేసింది. అనంతరం వచ్చిన ‘బాహుబలి2’ ద్వారా క్రేజ్ మరింత బలపడింది.
ఒక్కో సినిమాతో..
బాహుబలి సినిమాల అనంతరం బాలీవుడ్ చూపు దక్షిణాది వైపు పడింది. ఆ సమయంలోనే కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘కేజీఎఫ్’ సినిమా రావడం సంచలనంగా మారింది. ఈ సినిమా అన్ని భాషల్లోనూ ప్రేక్షకాదరణ పొందింది. టాలీవుడ్‌తో పాటు కన్నడ ఇండస్ట్రీ ఖ్యాతి వెలుగు వెలిగింది. అనంతరం దక్షిణాది భాషల్లో రూపుదిద్దుకున్న సినిమాలు క్రమంగా పాన్ ఇండియా మూవీలుగా ఎదిగాయి. 2021లో విడుదలైన ‘పుష్ప’ సినిమా మరోసారి టాలీవుడ్ టాలెంట్ ఏంటో నిరూపించింది. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్టింగ్‌తో కొత్త ట్రెండ్‌ని సృష్టించాడు. గతేడాది విడుదలైన సీతారామం, కార్తికేయ2 సినిమాలు బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లను సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
‘RRR’తో మరింత గుర్తింపు
బాహుబలి సినిమాలతో ప్రపంచానికి తెలుగు సినిమా రుచి చూపించిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగోడి సత్తా చూపించాడు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారంటే సినిమా ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా, ఆస్కార్ స్థాయి కలిగిన ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’కు ఎంపికవ్వడంతో మరింత ఖ్యాతిని పెంచింది. దిగ్గజ దర్శకులుగా పేరొందిన స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్లు కూడా రాజమౌలి పనితనానికి మెచ్చుకున్నారు. రాజమౌళితో పనిచేయాలన్న కుతాహలాన్ని బయటపెట్టారు. ఇలా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా ఒక్కటే కాదని, దక్షిణాది సినిమాల్లోనూ ఎంతో సబ్జెక్ట్ ఉందని నిరూపితమైంది.
పెరిగిన సినిమా పరిధి
టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్.. ఇలా ఏ భాషా చిత్రం విడుదలైనా అది పాన్ ఇండియా స్థాయిలో మెప్పు పొందుతోంది. అంచనాలు లేకుండా విడుదలైన ‘కాంతార’ సినిమా ఇందుకు చక్కటి ఉదాహరణ. ఇలా ఒకొక్క సినిమా స్థాయి క్రమంగా ప్రాంతీయ పరిధిని దాటుకొని పాన్ ఇండియాగా ఎదుగుతుండటంతో బాలీవుడ్ కన్ను దక్షిణాదిపై పడింది. ఇక్కడి తారలను వారి సినిమాల్లోని పాత్రల కోసం సంప్రదించడం, దక్షిణాది టెక్నిషియన్లతో బాలీవుడ్ సెలబ్రిటీలు పనిచేయాలని భావిస్తుండటం దీనికి నిదర్శనం.
అట్లీ, షారూక్ కాంబోలో..
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ అట్లీ. ఈయన తమిళ దర్శకుడు. అంతేగాకుండా ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ‘అనిరుధ్ రవిచందర్’ సంగీతం అందిస్తున్నాడు. పైగా, ఈ సినిమాలోని ఓ పాత్రకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని సంపద్రించినట్లు టాక్. ఇలా సినిమాలో హీరో తప్ప మిగతా ప్రధాన పాత్రలను దక్షిణాది సెలబ్రిటీలు పోషించడం దక్షిణాది ఇండస్ట్రీలకు వన్నె తెచ్చేదే.
‘ఆదిపురుష్’ మూవీ
ప్రభాస్‌తో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ‘ఆదిపురుష్’ తెరకెక్కించాడు. ఇలా తెలుగు, హిందీ కాకుండా కాకుండా, వేరే భాషల్ డైరెక్టర్లు, టెక్నిషియన్లు ఇతర భాషల హీరోలతో జత కట్టడం కూడా సినిమా ప్రమాణాలను పెంచుతోంది. ఇటీవల విడుదలైన ‘వారసుడు’ ‘సార్’ ఈ కోవకు చెందినవే. తెలుగు డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లి విజయ్‌తో సినిమా తీయడం, వెంకీ అట్లూరి ధనుష్‌ని ‘సార్’గా చూపించడంతో సినిమా పరిధి పెరిగింది. ఈ తరహా కాంబినేషన్లతో కొన్ని సినిమాలు సెట్స్‌పై ఉండగా, మరికొన్ని ఖరారయ్యాయి. రామ్‌చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న ‘RC15’, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ ‘సలార్’, నాగచైతన్య, వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న ‘కస్టడీ’.. ఇలా లిస్టులో చాలా ఉన్నాయి.
ఓటీటీ వల్ల కూడా
ఓటీటీ వల్ల దక్షిణాది సినిమాల ప్రమాణాలేంటో అన్య భాషల ప్రేక్షకులు గుర్తించారు. ఫలితంగా నటీనటులకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ లభించింది. అందుకే ఇప్పుడు రూపుదిద్దుకుంటున్న బడా సినిమాల్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా దక్షిణాది చిత్రాల స్థాయి, ప్రమాణాలు విశ్వవ్యాప్తమై భారత సినీ పరిశ్రమలో ఆధిపత్య ధోరణి తగ్గిందని చెప్పడానికి ప్రస్తుత పరిస్థితులే నిదర్శనం.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది