వీకెండ్ అంటే సినిమా ప్రియులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు. థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంటాయి. అందుకే వీకెండ్ కోసం మూవీ లవర్స్ వీక్ ప్రారంభం నుంచే ఎదురు చూస్తుంటారు. అయితే ఓటీటీల్లో ఈ వారం కూడా పలు కొత్త చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఎంచక్కా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటి ప్లాట్ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఎస్.జె.సూర్య విలన్‌గా ఆకట్టుకున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్ అభిరామి, అదితి బాలన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే ‘సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. అక్కడ అరాచకం చేస్తున్న పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? అక్కడి వారికి ఏ విధంగా అండగా నిలిచాడు?’ అన్నది స్టోరీ.
డిమోంటి కాలనీ 2 (Demonte Colony 2)
హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2) ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అరుళ్ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టులో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 27 నుంచి ‘జీ 5’లో తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2015లో వచ్చిన ‘డిమోంటి కాలనీ’కి సీక్వెల్‌గా ఇది రూపొందింది. ప్లాట్ ఏంటంటే ‘డెబీ (ప్రియా భవానీ శంకర్) భర్త శ్యామ్ అనుమానస్పదంగా సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఓ పుస్తకం చదవడం వల్లే అతడు చనిపోయినట్లు ఆమెకు తెలుస్తుంది. తన భర్తలాగే ఆ బుక్ చదివిన మరికొందరు కూడా సూసైడ్ చేసుకున్నట్లు గ్రహిస్తుంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ (అరుళ్ నిధి) అతడి కవల సోదరుడు కూడా బుక్ చదువుతారు. ఇది గ్రహించిన డెబీ వారిని ఎలా కాపాడింది? ఇంతకీ ఆ బుక్ వెనకున్న దుష్ట శక్తి ఏంటి?’ అన్నది స్టోరీ.
ప్రతినిధి 2 (Prathinidhi 2)
నారా రోహిత్ (Nara Rohit) హీరోగా రాజకీయం నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). ఆయన గతంలో నటించిన ‘ప్రతినిధి’కి సీక్వెల్‌గా పాత్రికేయుడు మూర్తి దేవప్తపు తెరకెక్కించారు. మేలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 27 (Prathinidhi 2 OTT Release) నుంచి ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ కానుంది. ప్లాట్ ఏంటంటే ‘చేతన్ (నారా రోహిత్) నిజాయతీ గల జర్నలిస్టు. NCC ఛానల్ సీఈవోగా ఉంటూ రాజకీయ నాయకుల అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తుంటాడు. ఈ క్రమంలో సీఎంపై హత్యాయత్నం జరుగుతుంది. దాని వెనక ఉంది ఎవరు? సీబీఐ పరిశోధనలో తేలిందేంటి? రాజకీయ వ్యవస్థలపై నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి?’ అన్నది స్టోరీ.
35 చిన్న కథ కాదు
ప్రముఖ నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు.ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ వీకెండ్‌లో మిమల్ని అలరించేందుకు ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 27 నుంచి ఆహా వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘ప్రసాద్ (విశ్వదేవ్), సరస్వతి (నివేదా థామస్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్య భర్తలు. పెద్ద కుమారుడు అరుణ్ స్కూల్లో ఆరో తరగతి చదువుతుంటాడు. మ్యాథ్స్‌లో చాలా వీక్. దాంతో లెక్కల మాస్టారు చాణక్య (ప్రియదర్శి) అరుణ్‌కి జీరో అని పేరు పెడతాడు. పరీక్షల్లో ఫెయిల్ కూడా చేస్తాడు. అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్కల్లో కనీసం 35 మార్కులు సాధించాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ పరిస్థితుల్లో అరుణ్ ఏం చేశాడు? అతడికి తల్లి సరస్వతి ఎలా సాయం చేసింది?’ అన్నది స్టోరీ.
స్త్రీ 2
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ2 చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) చూసే అవకాశం మాత్రమే ఉంది. ఆగష్టు 15న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 700 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్లాట్ ఏంటంటే ‘చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగింది అని అందరూ ఊపిరి పీల్చుకునేలోపు ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (ఆపర్ శక్తి ఖురానా)తో కలిసి ఓ భూతం (శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది?’ అన్నది స్టోరీ.
డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్ (Deadpool & Wolverine)
ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ హీరోలుగా నటించారు. డెడ్‌పూల్, వుల్వరైన్ పాత్రలను వారు పోషించారు. ప్లాట్ ఏంటంటే ‘డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్ కార్ల సేల్స్ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఓ రోజు అతడ్ని టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616కు తీసుకెళ్తారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్ సాయం అవసరం అవుతుంది. అసలు ఎర్త్ 616 అంటే ఏంటి? డెడ్‌పూల్‌ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు? అక్కడ డెడ్‌పూల్ – వాల్వెరైన్ చేసిన సాహసాలు ఏంటి?’ అన్నది స్టోరీ.
వాజా (Vaazha – Biopic of a Billion Boys)
ఇటీవల మలయాళంలో రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం ‘వాజా‘. ఏ బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్ అనే ట్యాగ్‌తో ఈ సినిమా రిలీజైంది. ఆగస్టు 15న ఈ చిత్రం మలయాళం మంచి విజయాన్ని సాధించింది. ఈ వారమే ఓటీటీలోకి వచ్చింది. సెప్టెంబర్ 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ‘జీవితంలో ఎలాంటి లక్ష్యం పెట్టుకోకుండా ఐదుగురు స్నేహితులు జులాయిగా జీవిస్తుంటారు. అయితే వారి తల్లిదండ్రులు మాత్రం వారిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వయసు పెరుగుతున్న కొద్ది తల్లిదండ్రుల్లో ఆందోళన మెుదలవుతుంది. మరి ఆ ఐదుగురు ఫ్రెండ్స్ జీవితంలో సక్సెస్ అయ్యారా? లేదా?’ అన్నది స్టోరీ.
ముంజ్య (Munjya)
బాలీవుడ్ నటి శార్వారీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ముంజ్యా’. ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించాడు. ఇటీవల హిందీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘1952లో తనకంటే పెద్దమ్మాయిని గోట్యా అనే పిల్లాడు ప్రేమిస్తాడు. ఆమెను దక్కించుకునేందుకు చేతబడి చేయబోతాడు. అయితే అది వికటించి పిల్ల దెయ్యం ముంజ్యగా మారతాడు. ప్రస్తుతం పుణెలో ఉంటున్న బిట్టు (అభయ్ వర్మ) అనుకోకుండా ముంజ్యకు విముక్తి కలిగిస్తాడు. ఆ ముంజ్య బిట్టును ఎన్ని ఇబ్బందులు పెట్టింది? దాని లక్ష్యం ఏంటి? చివరికీ ఏమైంది?’ అన్నది స్టోరీ.
మారుతీ నగర్ సుబ్రమణ్యం (Maruthi Nagar Subramanyam)
మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రం సెప్టెంబర్ 20న ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో వీక్షించవచ్చు. ప్రముఖ నటుడు రావు రమేశ్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రానికి థియేటర్లలో పాజిటివ్ టాక్ దక్కింది. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఆగస్టు 23న థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి కూడా ముఖ్యమైన పాత్రలు చేశారు. ప్లాట్ ఏంటంటే ‘సుబ్రమణ్యం (రావు రమేశ్) 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది హోల్డ్‌లో ఉండి పోతుంది. చేస్తే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని సంకల్పించి మరో పని చేయకుండా సుబ్రమణ్యం ఖాళీగానే ఉంటాడు. భార్య సంపాదనపై జీవిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి ఖాతాలో రూ.10 లక్షలు జమ అవుతాయి. ఆ డబ్బు ఎవరిది? సుబ్రమణ్యంకు జాబ్ వచ్చిందా? లేదా? అతడి కొడుకు అంకిత్ లవ్ ట్రాక్ ఏంటి?’ అన్నది స్టోరీ.
తిరగబడరా సామి
రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తిరగబడరా సామీ’ (Tiragabadara Saami). సెప్టెంబర్ 20 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. సీనియర్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ‘గిరి (రాజ్ తరుణ్) చాలా పిరికివాడు. ప్రతి దానికి భయపడుతూ ఉంటాడు. ప్రేయసి శైలజా (మాల్వీ మల్హోత్ర) అలా కాదు. చాలా దూకుడుతో వైలెంట్‌గా ఉంటుంది. టీజ్ చేసిన వారిని ఇరగ దీస్తుంటుంది. శైలజాను కంట్రోల్ చేయలేక గిరి ఎలాంటి తిప్పలు పడ్డాడు? ఎప్పుడూ సౌమ్యంగా ఉండే గిరి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది?’ అన్నది స్టోరీ.
సోపతులు
సోపతులు చిత్రం నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. సెప్టెంబర్ 19 నుంచి ఈటీవీ విన్ వేదికగా ప్రసారం అవుతోంది. తెలంగాణ రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో దర్శకుడు అనంత్ వర్ధన్ ఈ సినిమాను తెరకెక్కించారు. భాను ప్రకాశ్, శృజన్, మోహన్ భగత్, అనూష రమేశ్, మణి అయిగుర్ల, అంజయ్య మిల్కూరి ప్రధాన పాత్రలు చేశారు. ‘సోపతులు గ్రామంలోని స్కూల్‌లో ఇద్దరు బాలలు చదవుకుంటూ ఉంటారు. క్రికెట్, గోలీలు ఆడుతూ సంతోషంగా జీవిస్తుంటారు. అనూహ్యంగా కరోనా లాక్‌డౌన్ వచ్చి వారు విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆన్‌లైన్ క్లాసుల కోసం మెుబైల్ కొనేందుకు తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? విడిపోయిన స్నేహితులు ఎంత బాధపడ్డారు?’ అన్నది స్టోరీ.
ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్
అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island). ఈ సిరీస్ సెప్టెంబర్ 20వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌కు అనిష్ యెహాన్ కురువిల్లా దర్శకత్వం వహించారు. ప్లాట్ ఏంటంటే ‘మోక్ష ఐల్యాండ్ లోని ప్రతి జీవాన్ని, ప్రతి మార్గాన్ని డాక్టర్ విశ్వక్ సేన్ సృష్టిస్తాడు. అలాంటి దీవిలోకి అడుగుపెట్టిన ఆయన వారసులకు అనూహ్యమైన ఘటనలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఏంటి? వారసులనే ఎందుకు టార్గెట్ చేశారు? దాని వెనక ఎవరున్నారు?’ అన్నది స్టోరీ.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది