• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood Best Climax Scenes: తెలుగులో ఇలాంటి క్లైమాక్స్‌లు మళ్లీ మళ్లీ రావు.. మీరే చూడండి!

    ఏ సినిమాకైనా సరైన ముగింపు అవసరం. మూవీలో పాత్రల తీరుతెన్నులు, కథాబలం, హాస్యం, భావోద్వేగాలు ఎంత చక్కగా కుదిరినప్పటికీ క్లైమాక్స్‌ సరిగ్గా లేకుంటే ఆశించిన ఫలితం లభించలేదు. అందుకే డైరెక్టర్లు సినిమా అంతా ఒక ఎత్తు.. క్లైమాక్స్ మరో ఎత్తు అని భావిస్తుంటారు. అందుకు అనుగుణంగా సినిమా ముగింపును డిజైన్‌ చేసుకొని హిట్స్‌ కొడుతుంటారు. తెలుగులో ఇప్పటివరకూ వందలాది చిత్రాలు విడుదలైన కొన్ని సినిమాల క్లైమాక్స్‌లు మాత్రమే ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. అటువంటి బెస్ట్‌ క్లైమాక్స్‌ సీన్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం. 

    దసరా (Dasara)

    నేచురల్‌ స్టార్‌ నాని, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్‌ ‘దసరా‘. నూతన డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో క్లైమాక్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అప్పటివరకూ మోస్తరుగా సాగుతున్న కథకు క్లైమాక్స్‌తో గట్టి బూస్టప్‌ ఇచ్చాడు దర్శకుడు. ముఖ్యంగా నాని ఆ సీన్‌లో విశ్వరూపం చూపిస్తాడు. శత్రువులను ఊచకోత కోస్తాడు. 15నిమిషాల పాటు సాగే క్రైమాక్స్ సీన్‌ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.

    ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)

    రామ్‌చరణ్‌, తారక్‌ కథానాయకులుగా చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ప్రతీ సీన్ ఓ దృశ్యకావ్యంగా ఉంటుంది. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి క్లైమాక్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. తరుముకొస్తున్న బ్రిటిష్‌ సేనలను ఎదిరించే ధీరులుగా క్లైమాక్స్‌లో తారక్‌, చరణ్‌లను చూపించారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ను శ్రీరాముడిగా చూపే సీన్‌ను ఫ్యాన్స్‌ ఎప్పటికీ మర్చిపోరు. అటు తారక్‌ సైతం ఎంతో సాహసోపేతంగా బ్రిటిష్‌ సైన్యాన్ని ఏరిపారేస్తాడు.

    బాహుబలి 2

    ‘బాహుబలి 2’ సినిమా క్లైమాక్స్‌ను దర్శకుడు రాజమౌళి హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించారు. ద్వారాలు మూసి ఉన్న మాహిష్మతి కోటలోకి అమరేంద్ర బాహుబలి తాడి చెట్లను ఉపయోగించి వెళ్లే సీన్‌ ఆకట్టుకుంటుంది. భల్లాలదేవ సైన్యంతో ప్రభాస్‌ సానుభూతి పరులు చేసే యుద్దం గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. చివర్లో రాణాను చంపి ప్రభాస్‌ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడంతో సినిమా ముగుస్తుంది. 

    గ్యాంగ్‌ లీడర్‌ (Gang Leader)

    మాస్‌ ఆడియన్స్‌కు ఇప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తన నటనతో అదరగొట్టాడు. అటు చిరు సినిమాల్లో వచ్చిన బెస్ట్ క్లైమాక్స్ సీన్‌ అనగానే ముందుగా ఈ సినిమానే అందరికీ గుర్తుకు వస్తుంది. తన అన్నను చంపిన విలన్లపై క్లైమాక్స్‌లో చిరు రివేంజ్ తీర్చుకోవడం హైలెట్‌గా నిలుస్తుంది. సోదరుడ్ని ఎలా చంపారో ‌అచ్చం అదే విధంగా బండరాయి కట్టిన భారీ ప్రొక్లెయిన్‌ను విలన్‌ మీద వేసి చిరు హతమారుస్తాడు. 

    ఈగ (Eega)

    దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టిగా ‘ఈగ’ సినిమా తెరకెక్కింది. పవర్‌ఫుల్‌ విలన్‌ సుదీప్‌ను ఒక సాధారణ ఈగ ఎలా చంపుతుంతో క్లైమాక్స్‌లో రాజమౌళి చూపించాడు. తాను చనిపోతానని తెలిసి కూడా ఈగ మంటల గుండా మందుగుండు ఉన్న తుపాకీలోకి దూకుతుంది. దీంతో గన్‌ ఫైర్‌ అయ్యి విలన్‌ చనిపోయే సీన్స్‌ క్లాప్స్ కొట్టిస్తుంది. 

    పోకిరి (Pokiri)

    తెలుగులో అప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో ‘పోకిరి’ తరహా క్లైమాక్స్ ఎందులోనూ రాలేదు. అప్పటివరకూ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న మహేష్‌ బాబు.. పోలీసు అని రౌడీలను ఏరివేసే మిషన్‌లో పనిచేస్తున్నాడని తెలిసి సగటు ఆడియన్స్ షాక్‌కు గురవుతారు. తన తండ్రిని చంపిన ప్రకాష్‌ & కోపై క్లైమాక్స్‌లో రివేంజ్‌ తీర్చుకునే సీన్ నెవర్‌ బీఫోర్‌ అన్నట్లుగా ఉంటుంది. 

    తమ్ముడు (Thammudu)

    స్పోర్ట్స్‌ తరహాలో ఓ క్లైమాక్స్‌ను డిజైన్ చేయవచ్చు అని ‘తమ్ముడు’ సినిమా ద్వారా డైరెక్టర్‌ జగన్నాథ్‌ చూపించారు. తన అన్న కోసం బాక్సింగ్‌ కోర్టులో నిలిచిన పవన్‌ కల్యాణ్‌.. తొలుత విలన్‌ చేతుల్లో తన్నులు తింటాడు. తన తండ్రి, అన్న మాటలతో ప్రేరణ పొంది.. తిరిగి పుంజుకుంటాడు. విలన్‌ను బాక్సింగ్‌ కోర్టులో ఓడించి తన అన్న కలను నెరవేరుస్తాడు. అప్పటివరకూ పనికిరాని వాడంటూ తిట్టిన తండ్రి చేత శభాష్ అనిపించుకుంటాడు. 

    ఖుషి (kushi)

    పవన్‌ కల్యాణ్‌, భూమిక జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా క్లైమాక్స్‌ను కూడా దర్శకుడు ఎస్‌.జే. సూర్య రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా తెరకెక్కించాడు. క్లైమాక్స్‌ను రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో డైరెక్టర్‌ ప్లాన్‌ చేశారు. ఊరికి వెళ్లిపోతున్న హీరోయిన్‌ను పవన్‌ కల్యాణ్ ఏంతో టెన్షన్‌తో వెతుకుతుంటాడు. కట్‌ చేస్తే పెళ్లై వారిద్దరూ అరడజనుకు పైగా పిల్లలతో కనిపించి చివర్లో కొద్దిసేపు నవ్వులు పూయిస్తారు. 

    విరుపాక్ష (Virupaksha)

    సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా చేసిన ‘విరూపాక్ష’ చిత్రం.. ఓ హారర్‌ సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరోయినే ప్రధాన విలన్‌ తెలియడంతో ఆడియన్స్‌ షాకవుతారు. ఈ మూవీ ముగింపును చూసి ఆడియన్స్‌ చాలా థ్రిల్‌ ఫీలవుతారు. ఈ విజయంలో క్లైమాక్స్‌ కూడా కీలక పాత్ర పోషించిందని అప్పట్లో విశ్లేషణలు కూడా వచ్చాయి. 

    సై (Sye)

    నితిన్‌ – జెనిలియా జంటగా నటించిన ఈ సినిమా ఓ కాలేజీ గ్రౌండ్‌ చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రౌండ్‌ను సొంతం చేసుకునేందుకు కాలేజీ స్టూడెంట్‌ అయిన నితిన్‌ తోటి విద్యార్థులతో కలిసి.. విలన్లతో రగ్బీ ఆడతాడు. మానవ మృగాల్లాంటి విలన్లతో కాలేజీ కుర్రాళ్లు పోరాడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. 

    రోబో 2.0 (Robo 2.0)

    డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ఈ చిత్రంలో క్లైమాక్స్.. విజువల్‌ ట్రీట్‌గా ఉంటుంది. ఓ ఫుట్‌బాల్‌  స్టేడియంలో విలన్‌ పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌)తో రోబో (రజనీకాంత్‌) తలపడతుంది. ఈ తరహా క్లైమాక్స్‌ను హాలీవుడ్‌లో తప్ప భారత సినీ చరిత్రలో చూసి ఉండరు. 

    అలా వైకుంఠపురంలో (Ala Vaikunthapurramuloo)

    అల్లుఅర్జున్‌ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాల్లో ‘అలా వైకుంఠపురంలో’ ఒకటి. ఈ సినిమా క్లైమాక్స్‌ను ఓ పాటతో దర్శకుడు త్రివిక్రమ్‌ ముగించడం విశేషం. క్లైమాక్స్‌లో ‘సిత్తరాల సిరపడు’ పాటతో విలన్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. పాట పూర్తయ్యే లోగా విలన్‌తో పాటు అతడి అనుచరులకు తనదైన శైలిలో బుద్ది చెబుతాడు. 

    అత్తారింటికి దారేది (Attarintiki Daredi)

    పవన్‌ కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో క్లైమాక్స్‌ వైవిధ్యంగా ఉంటుంది. ఎటువంటి ఫైట్స్‌ లేకుండా భావోద్వేగ మాటలతోనే త్రివిక్రమ్‌ ఈ సినిమాను ముగించాడు. తన అత్తను పుట్టింటికి తీసుకెళ్లేందుకు పవన్‌ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ మెుత్తాన్ని ఓ రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించడం గమనార్హం. 

    సుస్వాగతం (Suswagatham)

    భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ క్లైమాక్స్‌ వరకు హీరోయిన్‌ను సిన్సియర్‌గా లవ్‌ చేస్తుంటాడు. కానీ ఆమె పవన్‌ ప్రేమను అర్థం చేసుకోదు. క్లైమాక్స్‌లో పవన్‌ ప్రేమను అర్థం చేసుకొని హీరోయిన్‌ అతడి వద్దకు వెళ్తుంది. అప్పుడు పవన్‌ చెప్పే డైలాగ్స్‌ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆమె ప్రేమకోసం తాను ఏమేమి కోల్పోయానో చెప్పడంతో పాటు.. ప్రేమ మూలంగా యువత ఎలా పిచ్చోళ్లుగా మారుతున్నారో పవన్‌ పేర్కొంటాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv