టాలీవుడ్‌లో కొత్త శకం మెుదలైంది. వినూత్న ఆలోచనలు కలిగిన దర్శకులు కొత్త కథలతో వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నారు. పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, శ్రీను వైట్ల, రామ్ గోపాల్ వర్మ, వి.వి. వినాయక్, తేజ, గుణశేఖర్ వంటి స్టార్ డైరెక్టర్లు హిట్స్ లేక ఇబ్బంది పడుతుంటే కుర్ర దర్శకులు మాత్రం ఫస్ట్ సినిమాతోనే అలవోకగా బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఫ్రెష్ కథలు, వైవిధ్యమైన మేకింగ్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తున్నారు. ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్స్ ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
అంజి కె. మణికుమార్
ఎన్టీఆర్ బామ మరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ఆయ్’ (Aay). అంజి కె. మణిపుత్ర (Anji K. Maniputhra) ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయం అయ్యారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘తంగలాన్ ’వంటి పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని నిలబడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. గోదావరి నేపథ్యంలో తనదైన మేకింగ్ స్టైల్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించి ప్రసంసలు అందుకున్నారు. అమలాపురం నేపథ్యం, చిన్న నాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, ఆప్యాయతలు, వెటకారం ఇలా అన్నింటిని మేళవిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.
యదువంశీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు‘ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.17.76 కోట్లు (GROSS) వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతోనే యదువంశీ (Yadu Vamsi) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓ గ్రామం నేపథ్యంలో కుర్రాళ్లతో సాగిన ఈ కథను అతడు అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ముఖేశ్ ప్రజాపతి
అంజలి వేశ్యగా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘బహిష్కరణ‘. ఈ సిరీస్ ద్వారా దర్శకుడిగా ముఖేశ్ ప్రజాపతి (Mukesh Prajapati) డెబ్యూ ఇచ్చాడు. ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి వ్యూస్ సాధించింది. ఇందులో కుల వివక్షను కళ్లకు కట్టాడు దర్శకుడు. ఊరి పెద్ద అయిన వ్యక్తి అణగారిన వారి పట్ల ఎలా వ్యవహించేవారు? మహిళలను ఎలా హింసించేవారు? అన్నది ఈ సిరీస్‌లో చూపించారు. వేశ్య కోణంలో ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించిన ఈ రివేంజ్ డ్రామా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది.
శౌర్యువ్
నాని రీసెంట్ చిత్రం ‘హాయ్ నాన్న‘తో శౌర్యువ్ (Shouryuu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక టిపికల్ సబ్జెక్ట్‌ను తీసుకొని అతడు అందంగా ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని అతడు చక్కగా చూపించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తొలి చిత్రంతోనే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అతడు ఇంపాక్ట్ చూపించాడు. ‘హాయ్ నాన్న’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం సాధించింది.
కల్యాణ్ శంకర్
ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ యూత్ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో ‘మ్యాడ్‘ ఒకటి. దర్శకుడు కల్యాణ్ శంకర్ (Kalyan Sankar) తన తొలి ప్రయత్నంతోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా తనకు మంచి భవిష్యత్ ఉందని కల్యాణ్ శంకర్ తొలి చిత్రంతోనే చాటి చెప్పాడు. కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో ఆకట్టుకునే ఫన్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కామెడీ సీన్స్, డైలాగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కార్తిక్ దండు
‘విరూపాక్ష’ చిత్రంతో కార్తిక్ దండు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్‌లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. కార్తిక్ దండు సినిమాను నడిపిన విధానంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి.
శ్రీకాంత్ ఓదెల
నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు.
వేణు యెల్దండి
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. హీరో నానితో అతడు సినిమా తీసే అవకాశముంది.
ప్రశాంత్ వర్మ
అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారారు. 2024 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మహేష్, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
గౌతమ్ తిన్ననూరి
నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు నాని నటనపై ప్రశంసల వర్షం కురిసింది. గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలోనే గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. ప్రస్తుతం అతడు విజయ్ దేవరకొండతో ‘VD12’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తోంది.
బుచ్చిబాబు సానా
తొలి చిత్రం ‘ఉప్పెన’తో డైరెక్టర్ బుచ్చిబాబు సానా అందరి దృష్టిని ఆకర్షించారు. డిఫరెంట్ లవ్‌స్టోరీతో ప్రశంసలు అందుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని రామ్ చరణ్‌తో అనౌన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేయనుంది. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
తరుణ్ భాస్కర్
పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ఇటీవల ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కించారు.