• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • West Indies Tour: సీనియర్లకు టాటా.. బైబై! యంగ్ టాలెంట్‌ వైపు సెలెక్టర్ల లుక్!

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ ఓటమి అనంతరం ఎన్నో విమర్శలు ఎదురవుతున్నాయి. సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి భవిష్యత్తుపై దృష్టి సారించాలని మాజీలు, నిపుణులు సూచిస్తున్నారు. పుష్కలమైన వనరులు ఉన్నందున ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో జట్టును తీర్చిదిద్దాలని చెబుతున్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్ టూర్‌కి భారత్ సిద్ధమవుతోంది. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడటానికి పయనం కానుంది. దీంతో జాతీయ జట్టు ఎంపికలో యంగ్ ప్లేయర్లకు చోటివ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరి, తుది జట్టుతో చేరేందుకు ఆస్కారమున్న ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

    రింకూ సింగ్

    ఐపీఎల్‌ 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుతంగా రాణించిన ప్లేయర్ రింకూ సింగ్. ముఖ్యంగా, గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో 5 సిక్సులు బాదిన ఘటన ఐపీఎల్ చరిత్రలో గుర్తుండిపోతుంది. ఇలా డెత్ ఓవర్లలో మెరుగైన స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ మిడిలార్డర్‌లో కీలక ప్లేయర్‌గా మారాడు రింకూ. ఐపీఎల్ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన రింకూ 474 పరుగులు చేశాడు. దీంతో సెలక్షన్ కమిటీ దృష్టిలో పడ్డాడీ లెఫ్ట్ హ్యాండర్. భారత టీ20 జట్టులో రింకూకి చోటు లభించే అవకాశం ఉంది. 

    యశస్వి జైశ్వాల్

    యువ కెరటం యశస్వి జైశ్వాల్ పేరు కూడా సెలక్షన్ కమిటీ పరిశీలనలో ఉంది. టీ20ల్లో భారత్‌కు ఓపెనింగ్ సమస్య నెలకొంది. గత ప్రపంచకప్‌లోనూ ఓపెనింగ్ ద్వయం విఫలమైంది. దీంతో గిల్‌కు తోడుగా ఓపెనింగ్ చేసేందుకు ఓ నమ్మకస్థుడు కావాలి. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు యశస్వి ఎదురు చూస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తంగా 14 మ్యాచుల్లో 625 పరుగులు చేసి సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 

    జితేశ్ శర్మ

    పంజాబ్ కింగ్స్ ప్లేయర్ జితేశ్ శర్మ తన ఆటతీరుతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. మిడిలార్డర్‌లో వచ్చి జట్టుకు అవసరమైన కీలక పరుగులు చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా మెరుగైన స్ట్రైక్ రేటుతో ఆడగల నైపుణ్యం జితేశ్ సొంతం. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసి విజయాన్ని జట్టు వైపు తిప్పిన సందర్భాలున్నాయి. బ్యాటింగులో 5, 6 స్థానాల్లో వచ్చి పరుగులు రాబట్టగలడు. 

    శివం దూబె

    ఛాంపియన్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కి విలువైన ఆటగాడిగా మారి పవర్ హిట్టర్‌గా పేరును సంపాదించాడు శివం దూబె. నిల్చున్న చోటు నుంచే అలవోకగా సిక్సర్లు బాదగలడు. బంతిని బౌండరీ దాటించగలడు. ఈ లెఫ్ట్ హ్యాండర్‌కి టీమిండియా నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ప్రదర్శనతో అదరగొట్టి తనేంటో నిరూపించుకున్నాడు. 16 మ్యాచుల్లో 418 పరుగులు చేశాడు.  

    ముకేశ్ కుమార్

    ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన బౌలర్ ముకేశ్ కుమార్. డెత్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. మంచి వేగంతో సరైన లెంగ్త్‌లో బౌలింగ్ వేయగలడు. దీంతో ఈ బౌలర్‌ని టెస్టు జట్టులోకి తీసుకోవాలని సూచనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ముకేశ్ 10 మ్యాచులు ఆడి 7 వికెట్లు తీశాడు.

    సర్ఫరాజ్ ఖాన్

    టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్న ప్లేయర్లలో సర్ఫరాజ్ ఖాన్ ఒకడు. దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటుతూ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. గత రెండు రంజీ సీజన్లలో ఈ ప్లేయర్ అద్భుత ప్రదర్శన చేశాడు. 2021-23 టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌కీ సర్ఫరాజ్ ఖాన్‌ని ఎంపిక చేయకపోవడంపై చర్చ జరిగింది. దీంతో విండీస్‌తో టెస్టు సిరీస్‌కి సర్ఫరాజ్‌ని సెలక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv