ప్రపంచంలోనే అతిగొప్ప ఆధ్యాత్మిక దేశంగా భారత్ కీర్తి గడించింది. దేశంలో లక్షలాది హిందూ దేవాలయాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. రాజవంశ పాలకులు నిర్మించిన ఆ దేవాలయాలు.. అద్భుత కట్టడాలుగా, చారిత్రక వారసత్వ సంపదగా గుర్తింపు పొందాయి. ఆ గుళ్లను దర్శిస్తే ఆధ్యాత్మిక భావనతో పాటు… గొప్ప అనుభూతిని పొందొచ్చు. ఇంతకీ ఆ దేవాలయాలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బృహదీశ్వరాలయం (తమిళనాడు)
తంజావూరు లోని బృహదీశ్వరాలయాన్ని చోళ రాజు రాజరాజ చోళుడు క్రీ.శ. 1002 లో నిర్మించాడు. ఇందులో ప్రధాన దైవం శివుడు. ఈ ఆలయం నిర్మాణ నైపుణ్యపరంగా, శిల్పకళా వైభవపరంగా చాల ప్రసిద్ది చెందింది. పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తు ఉంటుంది. దాదాపు 80 టన్నుల బరువున్న గ్రానెట్ శిలతో ఈ ఆలయ శిఖారాగ్రాన్ని నిర్మించారు. అంత బరువున్న ఆ ఏకశిలను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఇప్పటికీ ఎవ్వరికి అంతుపట్టని విషయం. 80 టన్నుల బరువు గల రాయిని ఏ విధమైన సిమ్మెంట్, ఉక్కూ సహాయం లేకుండానే 13 అంతస్తులుగా మలిచి ఏరకమైన ఏటవాలూ లేకుండా నిర్మించడం అనేది నిజంగా అద్భుతం.
కోణార్క్ సూర్యదేవాలయం
భువనేశ్వర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోణార్క్ స్మారక కట్టడాలు కలిగిన అందమైన పట్టణం. ఇక్కడ గల అత్యంత ఆకర్షనీయమైన సూర్యదేవాలయాన్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. దీనిని క్రీ. శ. 13 వ శతాబ్దంలో నరసింహదేవ నిర్మించారు. ఆలయ నిర్మాణం కోసం దాదాపు 12 వేల మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు శ్రమించారని చెబుతారు.
సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిషీలు చెక్కిన శిల్పాలతో అలంకరించబడి ఉంది. ఈ ఆలయ సముదాయం మొత్తం ఏడు బలమైన అశ్వాలు, 12 జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది. ఆలయంపై పద్మము, కళషం అద్భుతంగా చెక్కబడి ఉంటుంది. ఖజురాహో ఆలయంపై ఉన్నట్లుగా ఇక్కడ కూడా శృంగారానికి సంబంధించిన శిల్పాలు ఉంటాయి. ఈ ఆలయం ఉన్న సముద్రం ఇసుక బంగారు రంగులో ఉంటుంది. ఆలయం చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా టైమ్ ఎంత అవుతుందో అక్కడి ప్రజలు చెప్పగలరు
దిల్వార జైన దేవాలయం (రాజస్థాన్)
దిల్వార జైన దేవాలయం రాజస్థాన్ లోని మౌంట్ అబూ సమీపంలో ఉంది. రాజస్థాన్ మొత్తం మీద అత్యంత అందమైన దేవాలయాలుగా జైన దేవాలయాలు ప్రసిద్ధి గాంచాయి. దిల్వారలో మొత్తం ఐదు ఆలయాలతో నిర్మితమైంది.
1. విమల్ వసాహి- జైనుల మొదటి తీర్థంకరుడైన శ్రీ ఆదినాథుడికు అంకితం చేయబడింది.
2.లూనా వసాహి- 22వ జైన తీర్థంకరుడైన శ్రీ నేమినాథుడికి అంకితం చేయబడింది .
3.పిట్టల్హర్ ఆలయం – జైనుల మొదటి తీర్థంకరుడైన శ్రీ ఆదినాథునికి అంకితం చేయబడింది.
4.పార్శ్వనాథ దేవాలయం- 23వ జైన తీర్థంకరుడైన శ్రీ పార్శ్వనాథునికి అంకితం చేయబడింది .
5. మహావీర్ స్వామి ఆలయం- 24వ జైన తీర్థంకరుడైన శ్రీ మహావీర్ స్వామికి అంకితం చేశారు.
ఈ దేవాలయాలను తెల్లటి పాలరాయితో అత్యంత అందంగా చెక్కారు. ఈ ఆలయ సౌందర్యానికి ప్రతీ ఒక్కరూ ముగ్దులు కావాల్సిందే.
ఆలయ నిర్మాణలపై తామరపువ్వులు, రేకులు, పువ్వులు, జైన పురాణాలు చెక్కబడి ఉన్నాయి. జంతువుల జీవన శైలీ బొమ్మలు, తీర్థంకరుల అవతరాలు వారి జీవిత ప్రయాణం అందమైన శిల్పాల రూపంలో కనిపిస్తుంది.
కైలాశనాథ్ ఆలయం (మహారాష్ట్ర)
కైలాశనాథ్ ఆలయం ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహలలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. రాళ్లు, కట్టుబడి సున్నం, సిమెంట్ వంటివి ఏమి ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం అద్భుతం. పైగా దీన్ని కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందికి చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు. ఎందుకు నిర్మించారనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలి ఉంది. ఆలయం క్రింద అండర్ గ్రౌండ్ సిటీ ఉంది. దీనిని ఎందుకు నిర్మించారన్నది అంతుపట్టని విషయం.
ఇక్కడ నిర్మించిన గుహలు, చెక్కిన శిల్పాలు వెర్వేరు కాలాల్లో చెక్కారు. ఈ గుహలలో హిందూ, బౌద్ధ మరియు జైన మత దేవాలయాలు, సన్యాసి ఆశ్రమాలు ఉన్నాయి. 16 వ గుహలో ఉన్న కైలాస నాథ దేవాలయం 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. కైలాశనాథ్ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏకశిలా శివాలయంగా కీర్తింప బడుతోంది.
విఠల ఆలయం (కర్ణాటక)
విఠల ఆలయం ఒకప్పటి విజయనగర సామ్రాజ్యానికి రాజధానైన హంపిలో కలదు. ఇది విష్ణుమూర్తి దేవాలయం. క్రీ.శ. 16 వ శతాబ్దంలో రెండవ దేవరాయ రాజు ఈ ఆలయాన్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించాడు. ఈ ఆలయంలో రంగ మండప పేరుతో 56 సంగీత స్తంభాలు ఉన్నాయి. వీటినే స-రి-గ-మ స్తంభాలు అని కూడా అంటారు. ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు పాశ్చాత్య శైలిలోని డో-రె-మి-స సంగీత స్వరాలు వినిపిస్తాయి. ఈ ఆలయాన్ని దర్శించిన వారంతా గొప్ప అనుభూతిని పొందుతుంటారు.
ఖజురహో సముదాయం (మధ్యప్రదేశ్)
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని తికంగర్ జిల్లాలో బెత్వా నది తీరాన ఖజురహో ఆలయ సముదాయం ఉంది. క్రీ.శ. 15 వ శతాబ్దంలో బుందేల్ఖండ్ రాజు రుద్ర ప్రతాప్ సింగ్ నిర్మించాడు. ఇక్కడ చతుర్భుజ ఆలయం, లక్ష్మీదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడి శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచాయి. ఇవి వాత్సాయన కామసూత్ర గ్రంథములోని వివిధ భంగిమలలో చెక్కబడ్డాయి. శృంగార శిల్పాకళా సముదాయానికి ఇవి మచ్చుతునకలు.
రామప్ప దేవాలయం (తెలంగాణ)
కాకతీయుల అద్భుత శిల్ప సంపదకు రామప్ప దేవాలయం నిదర్శనం. కాకతీయ వైభవం కళ్లకు కట్టేటట్టు.. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా దేవాలయ ఆవరణలో శిలలు చెక్కారు. ఆలయంలో నల్లరాతిపై చెక్కిన నాట్టకత్తెల శిల్పాలు, నంది విగ్రహం చూపరులను ఆకట్టుకుంటాయి. ఆలయ నిర్మాణంలో వాడిన ఇటుకలు నీటి తేలుతుండటం అద్భుతమై విషయం. ఆలయంపై చెక్కిన శిల్పాలు జయప సేనాని రచించిన నృత్యా రత్నావళి ఆధారంగా చెక్కారని చెబుతారు. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఈ ఆలయంలో రామలింగేశ్వర స్వామి పూజలు అందుకుంటున్నాడు.