• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL 2023: తుది అంకానికి ఐపీఎల్‌.. టైటిల్‌ గెలిచెదెవరు? GT, CSK, MI, LSG విన్నింగ్‌ ఛాన్సెస్‌ ఎలా ఉన్నాయి..!

    ఐపీఎల్-2023 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌ కనబర్చిన గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. మాజీ ఛాంపియన్ GT తో పాటు చెన్నై, ముంబయి వంటి బలమైన జట్లు ప్లేఆఫ్స్‌లో ఉండటంతో టైటిల్‌ ఎవరు గెలుస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టోర్నీలో ఆయా జట్ల ప్రదర్శన ఎలా ఉంది? వాటి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? కీలక ప్లేయర్లు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

    గుజరాత్‌ టైటాన్స్‌

    గతేడాది ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌.. అద్భుత ప్రదర్శనతో తొలి సీజన్‌లోనే టైటిల్‌ ఎగరేసుకుపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా IPL-2023 సీజన్‌లో అడుగుపెట్టిన టైటాన్స్‌ హార్దిక్ పాండ్య సారథ్యంలో అద్భుత ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌లకు గానూ పదింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఇతర ప్లేఆఫ్స్‌ జట్లతో పోలిస్తే GT.. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో ఎంతో స్ట్రాంగ్‌గా ఉంది. శుభ్‌మన్‌ గిల్‌ వరుస సెంచరీలతో సూపర్‌ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసి రానుంది. ఇక బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్‌ అదరగొడుతున్నారు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో వీరిద్దరే ఉన్నారు. దీన్ని బట్టి GT బౌలింగ్ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఇదే ఫామ్‌ను ప్లేఆఫ్స్‌లోనూ కొనసాగిస్తే గుజరాత్‌కు టైటిల్‌ గెలవడం ఏమంత కష్టం కాదు. అయితే ప్లేఆఫ్స్‌లో చైన్నె లాంటి బలమైన జట్టును ఎదుర్కొవడం GTకి పెద్ద సవాలుగా మారనుంది. చెన్నైపై గుజరాత్‌కు మంచి విన్నింగ్‌ రికార్డు ఉండటం ఆ జట్టుకు కలిసిరానుంది. 

    చెన్నై సూపర్‌ కింగ్స్‌

    గతేడాది పేలవ ప్రదర్శనతో లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టిన చెన్నైసూపర్‌ కింగ్స్‌.. ఈ సీజన్‌లో అదరగొట్టింది. 8 విజయాలు, ఒక డ్రాతో 17 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. తద్వారా ప్లేఆఫ్స్‌ చేరింది. ఇప్పటివరకూ నాలుగు ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచిన చెన్నై.. కెప్టెన్ ఎం.ఎస్‌ ధోని సారథ్యంలో ఐదోసారి కప్పు సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో చెన్నైకు కూడా కప్పు గెలిచే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఆ జట్టు ఓపెనర్లు డెవాన్‌ కాన్వే, రుత్‌రాజ్‌ గైక్వాడ్ అద్భుతంగా ఆడుతుండటం చెన్నైకి కలిసి రానుంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివం దూబే సైతం పవర్‌ హిట్టింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అటు బౌలింగ్‌లోనూ చెన్నై బలంగా కనిపిస్తోంది. పేసర్‌ దీపక్‌ చహార్, దేశ్‌పాండే పవర్‌ప్లేలో వికెట్లు తీస్తూ రాణిస్తున్నారు. మిడిల్ ఓవర్లలో రవీంద్ర జడేజా, చివర్లో మతీషా పతిరనా తమ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. అయితే కీలక మ్యాచుల్లో చేతులెత్తేయడం చెన్నైకి ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో డిసైడింగ్‌ మ్యాచుల్లోనూ చెన్నై తన ఫామ్‌ కొనసాగించగల్గితే కచ్చితంగా ఐదోసారి విజేతగా నిలుస్తుంది. 

    లక్నో సూపర్‌ జెయింట్స్‌

    ఈ ఏడాది ప్లేఆఫ్స్‌ చేరిన జట్లలో ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని టీమ్‌ ‘లక్నో సూపర్‌ జెయింట్స్‌’. కే.ఎల్‌ రాహుల్‌ సారథ్యంలో గతేడాది ఐపీఎల్‌లో అడుగుపెట్టిన LSG నిలకడగా రాణిస్తోంది. ఈ ఏడాది ప్రారంభ మ్యాచుల్లో అదరగొట్టిన లక్నో.. KL రాహుల్‌ దూరమవడంతో కాస్త తడపడింది. అయితే కీలక మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్‌లో అడుగు పెట్టింది. ఈ జట్టు టైటిల్‌ గెలవాలంటే చాలా కష్టపడాలి. LSG బ్యాటింగ్‌ లైనప్‌ ఎక్కువగా స్టొయినీస్‌, నికోలస్ పూరన్‌పైనే ఆధారపడుతోంది. సౌతాఫ్రికా బ్యాటర్‌ డీకాక్‌ జట్టులోకి వచ్చినా ఆశించిన ఇన్నింగ్స్‌ అతడి నుంచి రాలేదు. దీపక్‌ హుడా నుంచి పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉంది. అయితే కొత్త కెప్టెన్‌ కృనాల్‌ పాండ్య బ్యాటు, బంతితో రాణిస్తుండటం LSGకి కలిసిరానుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. పేసర్ నవీన్‌-ఉల్‌-హక్‌ అడపాదడపా వికెట్లు తీస్తున్నప్పటికీ దారళంగా పరుగులిస్తున్నాడు. LSG తన మైనస్‌లను అదిగమించగల్గితే టైటిల్ గెలవటం ఏమంత కష్టం కాకపోవచ్చు. 

    ముంబయి ఇండియన్స్‌

    గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోవడంతో రోహిత్‌ సారథ్యంలోని ముంబయి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. తడబడుతూనే ఈ సీజన్‌ ప్రారంభించిన ముంబయి చివరి మ్యాచ్‌లకు వచ్చేసరికి అత్యుత్తమ ఫామ్ అందుకుంది. పరిస్థితులు కూడా ముంబయికి కలిసిరావడంతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకొచ్చింది. ఇప్పటివరకూ ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబయి ఆరో ట్రోఫీపై కన్నేసింది. బ్యాటింగ్‌లో ఇషాన్‌ కిషాన్‌ రాణిస్తుండగా, మరో ఓపెనర్ రోహిత్‌ ఫామ్‌ లేమి MIకి సమస్యగా మారింది. SRH మ్యాచ్‌లో రోహిత్‌ అర్ధశతకంతో రాణించగా.. ఆ ఫామ్‌ను కొనసాగిస్తే ముంబయికి తిరుగుండదు. మిడిలార్డర్‌ సూర్యకుమార్ యాదవ్‌, గ్రీన్‌, టిమ్ డేవిడ్‌తో MI బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. దీంతో 200 పైగా రన్స్‌ను కూడా ముంబయి అలవోకగా ఛేజ్‌ చేయగల్గుతోంది. అయితే బౌలింగ్ ఆ జట్టుకు ప్రధాన సమస్యగా ఉంది. జోర్డాన్‌ దారాళంగా పరుగులు సమర్పిస్తుండటం MI కు మైనస్‌గా మారింది. స్టార్‌ స్పిన్నర్‌ లేకపోవడం కూడా ముంబయికి పెద్ద లోటు అని చెప్పొచ్చు. అయితే యంగ్‌స్టర్ ఆకాశ్‌ మధ్వల్‌ బౌలింగ్‌లో రాణిస్తుండటం MIకి ఊరటనిచ్చే అంశం. బౌలింగ్‌ తప్పులను సరిదిద్దుకుంటే ముంబయి టైటిల్ గెలవడం ఖాయమని చెప్పొచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv