ఐపీఎల్‌కు భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ అంటే భారత క్రీడాభిమానులకు ఓ క్రికెట్ పండగ లాంటిది. సాయంత్రమైతే చాలు క్రికెట్ లవర్స్ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఉత్కంఠరేపే మ్యాచ్‌లనూ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అంతటి ఖ్యాతి కలిగిన ఐపీఎల్‌లో ఏ చిన్న విషయం జరిగినా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందుకు అనుగుణంగానే ఇప్పటివరకూ జరిగిన ప్రతీ ఐపీఎల్ సీజన్ చాలా మెమోరీలను ప్రేక్షకులకు అందించాయి. తాజాగా ఈ సీజన్‌లోనూ కొన్ని ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆవేంటో ఇప్పుడు చూద్దాం.
ధోని కాళ్లుపట్టుకున్న సింగర్
ఐపీఎల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ ధోని కాళ్లుపట్టుకొని అందరినీ ఆశ్యర్యపరిచారు. కోట్లాదిమంది అభిమానులను కలిగి ఉన్నప్పటికీ తానూ మహేంద్రుడి ఫ్యాన్‌నే అని అర్జిత్ సింగ్ చాటిచెప్పారు. ఈ సంఘటన IPL ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీఒక్కరి హృదయాన్ని హత్తుకుంది.
రిషభ్‌పంత్ రాక
రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్‌పంత్ స్టేడియంలో తళుక్కుమన్నాడు. ఏప్రిల్ 4న గుజరాత్ టైటాన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ చూసేందుకు పంత్ వచ్చాడు. ప్రమాదం తర్వాత పంత్ బయటకు రావడం అదే తొలిసారి. పంత్‌ను చూసిన అభిమానులు తమ కేరింతలతో స్వాగతం పలికారు.
ఆస్కార్ నటులు
తమిళ డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కి ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో పురస్కారం వరించింది. ఇందులో వృద్ధ దంపతులుగా చేసిన బొమ్మ, బెయిలీలను చెన్నై యాజమాన్యం సత్కరించింది. మే 9న చెెన్నైలోని చెపాక్ స్టేడియానికి రాగా, వారితో ధోని ముచ్చటించారు. ఈ సందర్భంలో ధోని కుమార్తె కూడా అక్కడే ఉంది.
గంభీర్ vs కోహ్లీ
RCB vs LSG మ్యాచ్ సందర్భంగా కోహ్లీ – గంభీర్ మధ్య వివాదం చెలరేగింది. ఇరువురు కోపంగా అరుచుకుంటూ ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ ఫ్యాన్స్ ట్రోల్స్‌తో గంభీర్‌కు వ్యతిరేకంగా విరుచుకుపడ్డారు.
గంగూలీ vs కోహ్లీ
టీమ్‌ఇండియా మాజీ కోచ్ గంగూలీ, కోహ్లీ మధ్య కూడా స్వల్ప వివాదం చోటుచేసుకుంది. ఢిల్లీ vs ఆర్సీబీ మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్న కోహ్లీ ఆ తర్వాత బౌండరీ లైన్ వద్దకు వెళ్తూ డగౌట్‌లో ఉన్న గంగూలీ వైపు సీరియస్‌గా చూశాడు. మ్యాచ్ అనంతరం కూడా ఇరువురు కరచలనం చేసుకోకపోవడంతో ఈ వ్యవహరం చర్చనీయాంశంగా మారింది.
ధోని – గవాస్కర్
మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ తన చొక్కపై ధోని ఆటోగ్రాఫ్ తీసుకొని ఆశ్చర్య పరిచాడు. చెన్నై తన హోమ్‌గ్రౌండ్‌లో చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడిన అనంతరం ధోని మైదానంలో తిరుగుతూ CSK ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు. ఆ సందర్బంలో ధోని వద్దకు పరిగెత్తుకువచ్చిన గవాస్కర్ ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు. అందుకు ధోని అంగీకరించాడు.
సచిన్ రియాక్షన్
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. మహమ్మద్ షమీ వేసిన ఓ బంతిని థర్డ్ మ్యాన్ మీదుగా సిక్స్‌గా మలిచాడు. SKY షాట్‌కు ఫిదా అయిన సచిన్ డగౌట్ నుంచి సూర్య షాట్‌ను తన చేతితో అనుకరించాడు. ఇది అప్పట్లో తెగ వైరల్ అయింది.
మ్యాంగో వార్
లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీకి మధ్య మైదానంలో చెలరేగిన వివాదం సోషల్ మీడియాకు ఎక్కింది. ముంబయి – ఆర్సీబీ మ్యాచ్లో కోహ్లీ ఔటయ్యాక నవీన్ గిన్నెలోని మామిడి పండ్లను షేర్ చేశాడు. కోహ్లీని ఉద్దేశిస్తూ స్వీట్ మ్యాంగోస్ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో నవీన్‌ను టార్గెట్ చేసిన RCB ఫ్యాన్స్ అప్పటి నుంచి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఎంపైర్లపై ధోని ఆగ్రహం
మైదానంలో ఎప్పుడు కూల్‌గా ఉండే ధోనికి ఈసారి కోపం వచ్చింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో ఎంపైర్లపై ధోని అసహనం వ్యక్తం చేశాడు. మతీషా పతిరణను 16వ ఓవర్ వేసేందుకు అనుమతించకపోవడంపై బహిరంగంగానే తన అసంతృప్తిని తెలియజేశాడు.
నవీన్ vs MI
నిన్నటి మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మను 11 పరుగులకే నవీన్ ఔట్ చేశాడు. ఈ క్రమంలో చెవులను మూసుకొని తన జెర్సీని చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. కామెరూన్ గ్రీన్‌ను ఔట్ చేసిన సందర్భంలోనూ నవీన్ ఇలాగే చేశాడు. దీంతో ముంబయి ఫ్యాన్స్ నవీన్ పై ట్రోలింగ్ కు దిగారు. అటు ముంబయి ఆటగాళ్లు కుమార్ కార్తీకేయ, విష్ణు వినోద్, సందీప్ వారియర్ లు కూడా ఓ టేబుల్ ముందు మామిడి పండ్లను పెట్టి ‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు’ అన్న స్టైల్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది