Contents
తెలుగు సినీ పరిశ్రమ ఈ ఏడాది భారీ హిట్లను కొట్టింది. ఆర్ఆర్ఆర్‌తో మెుదలైన ప్రభంజనం హిట్-2 చిత్రం వరకు కొనసాగింది. బింబిసార, ఒకే ఒక జీవితం వంటి సినిమాలు ప్రేక్షకుల్ని టైం ట్రావెల్ చేయిస్తే…సీతారామం లాంటి కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం యువతను ఉర్రూతలూగించింది. రెండో అర్ధభాగంలో కార్తీకేయ-2 పాన్ ఇండియా లెవల‌్‌లో హిట్ కొట్టింది. విక్రమ్, కాంతారా వంటి పరభాష చిత్రాలు తెలుగులో విడుదలై సంచలనాలే సృష్టించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్, విజయ్ లైగర్ బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లా పడ్డాయి.
ఆరంభం అదుర్స్
సంక్రాంతి బరితో మెుదలైన సినిమా సందడిలో బంగార్రాజు మంచి హిట్ కొట్టింది. నాగార్జున తీసిన ఈ సీక్వెల్ చిత్రం కోటి రూపాయలతో తెరకెక్కగా రూ. 60 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఆరంభంలోనే బ్లాక్ బస్టర్ కొట్టి ఊపునిచ్చింది. తర్వాత వచ్చిన సిద్దూ జొన్నల గడ్డ…డీజే టిల్లు అంటూ ఉర్రూతలూగించాడు. యువతకు సినిమా క్రేజీగా నచ్చడంతో రూ. కోటితో తీసిన ఈ సినిమా కూడా రూ. 20 కోట్లు రాబట్టింది.
బ్లాక్ బస్టర్స్
రాజమౌళి ఆర్ఆర్ఆర్ కళాద్భుతంతో తొలి అర్ధభాగంలోనే భారీ హిట్ నమోదయ్యింది. రూ. 550 కోట్లతో తెరకెక్కి ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనుకున్నప్పటికీ రూ. 1111.7 కోట్ల వద్ద ఆగిపోయింది. సాధారణ అంచనాలతో వచ్చిన కార్తీకేయ-2 సినిమా కూడా పాన్ ఇండియా హిట్ సాధించింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించగా…రూ.120 కోట్లు రాబట్టింది. బాలీవుడ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో ఐదు రోజుల్లోనే థియేటర్ల సంఖ్య 53 నుంచి 1575కు పెంచారు. కల్యాణ్ రామ్ హీరోగా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన బింబిసార బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. రూ. 40 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ సినిమా రూ. 64.57 కోట్లు వసూలు చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో పాటు కల్యాణ్ రామ్ ఖాతాలోనూ మరో హిట్ చేరింది.
సెంటిమెంట్ హిట్స్
చిత్ర పరిశ్రమకు చాలా రోజుల తర్వాత హను రాఘవపూడి సీతారామం ద్వారా మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటనతో బాక్సాఫీస్ వద్ద క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రం రూ. 30 కోట్లతో తెరకెక్కి…ఏకంగా రూ.91.4 కోట్లు సంపాదించింది. నిజంగానే యుద్ధంతో రాసిన ప్రేమకథలా మారింది. అమ్మ సెంటిమెంట్ తో శర్వానంద్ తీసిన ఒకే ఒక జీవితం కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకుంది. రూ. 12 కోట్లతో చిత్రాన్ని తీయగా…రూ. 24 కోట్లు వసూలు చేసింది.
పరభాషా ప్రభంజనాలు
బహుభాషల్లో తెరకెక్కిన ఇతర ఇండస్ట్రీల చిత్రాలు తెలుగులోనూ ఆకట్టుకున్నాయి. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2తో, లోకేశ్ కనగరాజ్ విక్రమ్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు.100 కోట్లతో తెరకెక్కిన కేజీఎఫ్2 1207 కోట్లు రాబడితే.. విక్రమ్ సుమారు 500 కోట్లు కొల్లగొట్టింది. రిషబ్ షెట్టి నటించి స్వీయ దర్శకత్వం వహించిన కాంతారా ప్రభంజనం అంతా ఇంతా కాదు. రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా… రూ. 400 కోట్లపైనే వసూలు చేసింది. కన్నడలో భారీ కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన 777 చార్లీ రూ. 20 కోట్లతో చిన్న సినిమాగా రూపుదిద్దుకున్నప్పటికీ ఏకంగా రూ. 105 కోట్ల మార్క్ వసూళ్లు సాధించింది. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ కూడా మిక్స్‌డ్ టాక్ వచ్చినా తర్వాత దూసుకుపోయింది.
అడవి శేష్ ఆపరేషన్స్
సరికొత్త కథలను ఎంచుకునే అడవిశేష్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవతం ఆధారంగా మేజర్ సినిమాను తీశారు. రూ. 30 కోట్లతో తెరకెక్కగా..రూ. 58 కోట్లకు పైగా వసూలు చేసింది. మిగతా సినిమాల నుంచి పోటీ ఎదురైనా గట్టిగానే నిలబడింది. శైలేష్ కొలను యూనివర్స్‌లో భాగంగా వచ్చిన హిట్ 2 ఘన విజయం సాధించింది. కేవలం రూ. 10 కోట్లతో సినిమాను నిర్మించగా..దాదాపు రూ. 50 కోట్ల వసూలు చేసింది. ఈ ఏడాది శేష్ రెండు హిట్లు ఇచ్చాడు.
లెక్కసరిచేసిన చిరు
తొలి అర్థభాగంలో అట్టర్ ఫ్లాప్ అందుకున్న చిరంజీవి..సెకండాఫ్‌లో లెక్క సరిచేశారు. లూసిఫర్ రిమేక్‌ను గాడ్ ఫాదర్‌గా తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కగా..రూ. 108 కోట్లు రాబట్టింది. దీంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు.
స్టార్ హీరోస్ యావరేజెస్
టాలీవుడ్‌లో ఫ్యాన్ బేస్ ఎక్కువున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు అభిమానుల అంచనాలు అందుకోలేక పోయాయి. ‘సర్కారు వారి పాట’ యావరేజ్ పాటగానే మిగిలింది. మహేశ్ బాబును కొత్తగా చూపించినా కథ, కథనంలో పస లేకపోవడంతో రూ.100 కోట్లతో తీసిన సినిమా కేవలం రూ.187.4 కోట్లతో సరిపెట్టుకుంది. అలాగే మళయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’…తెలుగు కమర్షియల్ టచ్ తో యావరేజ్ కి పడిపోయింది. రూ.80కోట్లతో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ రూ.158.5 కోట్లు రాబట్టగలిగింది. అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ లో వచ్చిన F3 కూడా రూ.70 కోట్లతో తెరకెక్కి 90 కోట్లు సాధించి యావరేజ్ గా నిలిచింది.
బాగుంది కానీ బాలేదు
ఈ ఏడాది కొన్ని సినిమాలకు వింత పరిస్థితి ఏర్పడింది. హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్ల పరంగా డిజాస్టర్లుగా మారాయి. నాని,నజ్రియా ‘అంటే సుందరానికి’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. సాయి పల్లవి, రానా విరాటపర్వం కూడా ఇదే పరిస్థితి. చివర్లో వచ్చిన సమంత యశోద సినిమాకు కూడా వసూళ్లు అక్కడిక్కడికే వచ్చాయని టాక్.
అంచనాలు తారుమారు
మెగా హీరోస్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించడంతో భారీ అంచనాలతో విడుదలైన ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడింది. రూ.140 కోట్లతో తీసిన సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. రూ. 73.5 కోట్లతో నష్టాలను మూటగట్టుకుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ ‘ రాధే శ్యామ్’ కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. రూ.350 కోట్లతో తెరకెక్కిస్తే..కేవలం రూ.144కోట్లు రాబట్టి నిర్మాతలను నష్టాల్లో ముంచింది. విడుదలకు ముందు భారీ హైప్స్ క్రియేట్ చేసిన పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ లైగర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మార్నింగ్ షో తర్వాత నుంచే సినిమాకు ఆదరణ తగ్గిందంటే ఎంత నిరాశపర్చిందో అర్థం చేసుకోవచ్చు. రూ. 90 నుంచి 125 కోట్లు పెట్టి తీస్తే అందులో సగం కూడా రాలేదు. ఈ దెబ్బకు పూరీ తన తదుపరి చిత్రం జనగణమన కూడా వదిలేయాల్సి వచ్చింది.
అలా ఇలా
ఇంకొన్ని చిత్రాలు పేరుకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. అందులో ముఖ్యంగా స్టార్ హీరో గోపిచంద్ పక్కా కమర్షియల్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. రామ్ పోతినేని వారియర్, నాగ చైతన్య థాంక్యూ, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, నితిన్ మాచర్ల నియోజకవర్గం, విష్ణు జిన్నా చిత్రాలు విడుదలైనట్లే సగం మందికి తెలిదన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాగార్జున ది ఘోస్ట్, అనుదీప్ కేవీ, శివ కార్తీకేయన్ ప్రిన్స్, నరేశ్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలు ఆశించినస్థాయిలో ఆడలేదు.
చిట్టచివరకు
ఈ ఏడాది మెుత్తం తెలుగు పరిశ్రమలో మూడు హిట్లు ఆరు ఫ్లాపులు అన్నట్లుగా సాగినా…భారీ స్థాయిలో హిట్లు పడ్డాయి. మరోసారి తెలుగు సినిమా బలాన్ని అన్ని పరిశ్రమలు తెలుసుకునేలా చేశాయి. ఈ ఏడాది దేశంలో సినీ ఇండస్ట్రీలను తెలుగు చిత్ర పరిశ్రమ శాసించిందనే చెప్పాలి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో బీజం వేయగా..కార్తీకేయ ,సీతారామం, బింబిసార వంటి సినిమాలు మహా వృక్షంలా పెరిగి తెలుగు ఖ్యాతిని పెంచాయి.
టాప్-10 టాలీవుడ్ మూవీస్-2022
సినిమా | బడ్జెట్ ( రూ.లలో) | మొత్తం కలెక్షన్ (రూ.లలో) | ఫలితం |
ఆర్.ఆర్.ఆర్. | 550 కోట్లు | 1111.7 కోట్లు | బ్లాక్ బస్టర్ |
కార్తికేయ-2 | 15 కోట్లు | 120 కోట్లు | బ్లాక్ బస్టర్ |
కేజీఎఫ్-2 | 100 కోట్లు | 1207 కోట్లు | ఆల్ టైం బ్లాక్ బస్టర్ |
సీతారామం | 30 కోట్లు | 91.4 కోట్లు | బ్లాక్ బస్టర్ |
బింబిసార | 40 కోట్లు | 64.57 కోట్లు | బ్లాక్ బస్టర్ |
రాధేశ్యామ్ | 350 కోట్లు | 214 కోట్లు | డిజాస్టర్ |
ఆచార్య | 140 కోట్లు | 73.5 కోట్లు | డిజాస్టర్ |
బంగార్రాజు | 25 కోట్లు | 60 కోట్లు | హిట్ |
మేజర్ | 30 కోట్లు | 58.2కోట్లు | సూపర్ హిట్ |
డీజే టిల్లు | 10 కోట్లు | 21 కోట్లు | బ్లాక్ బస్టర్ |
అంటే సుందరానికి | 30 కోట్లు | 20.71 కోట్లు | యావరేజ్ |