• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood Political Movies: తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన  చిత్రాలు ఇవే!

    సినిమాలు కేవలం వినోద మాద్యమం మాత్రమే కాదు. అవి వినోదాన్ని పంచడంతో పాటు సమాజంలోని స్థితిగతులను కూడా ప్రతిబింబిస్తాయి. తద్వారా ప్రజల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో గత కొంత కాలంగా పొలిటికల్‌ చిత్రాల హవా పెరిగింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రజల రాజకీయ అభిప్రాయాలను ప్రభావితం చేసే విధంగా ఆ చిత్రాలు విడుదలవుతున్నాయి. టాలీవుడ్‌లో 2019 నుంచి ఈ పొలిటికల్‌ చిత్రాల ఒరవడి మెుదలవ్వగా.. 2024లోనూ అది కొనసాగుతూ వచ్చింది. ఆయా చిత్రాల విడుదల సందర్భంగా మెుదలయ్యే రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే మరికొన్ని సినిమాలు ఆదర్శనీయమైన రాజకీయ కథాంశాలతో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    యాత్ర (Yatra)

    దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర‘ (Yatra). మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహిచారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేయడానికి గల కారణాలు? చంద్రబాబు 9ఏళ్ల పాలనను కాదని ప్రజలు వైఎస్‌ఆర్‌కు ఎందుకు పట్టం కట్టారు? అన్నది చూపించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ అప్పటి తెలుగు దేశం పార్టీని గద్దె దిగడానికి ఒకింత సాయం చేసిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపించింది. 

    ఎన్.టి.ఆర్. మహానాయకుడు (NTR Mahanayakudu)

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్.టి.రామారావు.. రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రను పోషించారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటి విద్యా బాలన్‌.. ఎన్టీఆర్‌ భార్య బసవ తారకం పాత్రలో కనిపించింది. ఈ సినిమా మంచి పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది. నాదెండ్ల భాస్కరరావు.. కేంద్రంలోని కాంగ్రెస్‌ సాయంతో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఇందులో చూపించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ బలంగా ప్రజల్లోకి, దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల దృష్టికి తీసుకెళ్లి తిరిగి అధికారంలోకి రావడాన్ని దర్శకుడు క్రిష్‌ తెరపై ఆవిష్కరించారు. 

    లక్ష్మీస్ ఎన్టీఆర్‌ (Lakshmi’s NTR)

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎలా వచ్చింది? ఆమె రాక తర్వాత ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యులు ఎందుకు దూరమయ్యారు? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎలా జరిగింది? వంటి అంశాలను దర్శకుడు ఇందులో చూపించారు. ఈ మూవీపై అప్పటి తెలుగు దేశం పార్టీ కక్ష కట్టి విడుదల కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. చివరకు థియేటర్స్‌లో విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మూవీ అప్పటి ప్రతిపక్ష వైఎస్‌ఆర్సీపీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు వర్మ తెలిపారు.

    అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు (Amma Rajyamlo Kadapa Biddalu)

    2019 డిసెంబర్‌లో వచ్చిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు‘ సినిమాను కూడా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఏపీ రాజకీయాలను ఆధారంగా తీసుకొని రూపొందించాడు. సీఎం జగన్‌ అధికారం చేపట్టాక మాజీ సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్‌ మనోవేదనకు గురై ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎలాంటి పన్నాగాలు చేశారు అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీశారు. ఈ సినిమా విడుదలకు ముందు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. 

    జై బోలో తెలంగాణ (Jai Bholo Telangana)

    తెలంగాణ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా (Jai Bolo Telangana) తెరకెక్కింది. ప్రత్యేక తెలంగాణ కోసం తరతరాలుగా ప్రాణాలర్పిస్తూ వస్తున్న ఓ కుటుంబం చుట్టూ కథ సాగుతుంది. ముఖ్యంగా ఉద్యమం సమయంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను ఈ సినిమాలో చూపించడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎన్‌. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్‌, మీరానందన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 

    యాత్ర 2 (Yatra 2)

    ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెమీ బయోపిక్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కింది. వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి.. తన తండ్రి బాటలో నడవాలని జగన్‌ ఎందుకు నిర్ణయించుకున్నాడు.. ఆ లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో ‘యాత్ర’ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. 

    వ్యూహాం (Vyuham)

    వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఈ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. వైఎస్‌ఆర్‌ మరణం నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌.. జగన్‌ను ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? వాటిని జగన్‌ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది రామ్‌ గోపాల్‌ వర్మ తనదైన శైలిలో ఇందులో చూపించాడు. 

    శపథం (Sapadam)

    ‘వ్యూహం’ సినిమాకు కొనసాగింపుగా ‘శపథం’ మూవీని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జరిగిన పరిస్థితులను ఈ సినిమాలో తెరకెక్కించారు. జగన్‌ చేపట్టిన ప్రజా సంక్షేమాలను ఆపడానికి విపక్ష నేత చంద్రబాబు చేసిన కుట్రలు ఏంటి? ఓటమి తర్వాత పవన్‌ పరిస్థితి ఎలా ఉంది? అన్నది దర్శకుడు ఇందులో చూపించాడు. 

    రజాకార్‌ (Razakar)

    సెప్టెంబర్ 17, 1948కి ముందు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం అణచివేత పాలనకు, రజాకార్ల అరాచకాల మధ్య ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవించారు. వారి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమించారు అన్న దానిని కథాంశంగా చేసుకొని దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను రూపొందించారు. 

    రాజధాని ఫైల్స్‌ (Rajadhani Files)

    గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. భాను శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంల అఖిలన్‌ పుష్పరాజ్‌, విశాల్‌ పతి, వినోద్‌ కుమార్‌, వాణీ విశ్వనాథ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏపీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకొని నిర్మించడం గమనార్హం. 

    లీడర్‌ (Leader)

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లీడర్‌’ చిత్రం.. బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే హీరో రానా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తండ్రి మరణించడంతో స్వార్థపరుడైన వ్యక్తికి అధికారం కట్టబెట్టడం ఇష్టం లేని అర్జున్ (రానా) సీఎం అవుతాడు. అతడు సమాజంలోని అవినీతి, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశాడన్నది సినిమా. మిక్కీ జే మేయర్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. 

    భరత్‌ అనే నేను (Bharath Ane Nenu)

    మహేష్‌ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ కూడా మంచి విజయాన్ని సాధించింది. సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్న కోణంలో ఈ సినిమా తెరకెక్కింది. 

    నోటా (Nota)

    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ చేసిన తొలి పొలిటికల్‌ చిత్రం ‘నోటా’. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. ఇందులో ఓ రాష్ట్ర సీఎం కొడుకు అయిన వరుణ్‌ (విజయ్‌).. తండ్రి కేసులో ఇరుక్కోవడంతో పదవిలోకి వస్తాడు. ఆ తర్వాత సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడు? తప్పుచేసిన తండ్రిని సైతం ఎలా శిక్షించాడు? అన్న కోణంలో సినిమా రూపొందింది. ఇందులో విజయ్‌కు జోడీగా మెహ్రీన్‌ చేసింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv