ప్రతీవారం ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అందులో కొన్ని థియేటర్లలో విడుదలైనవి కాగా.. మరికొన్ని నేరుగా ఓటీటీలోకి వచ్చేవి ఉంటాయి. లవ్, ఫ్యామిలీ, క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా వివిధ జానర్లో వచ్చిన చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇటీవల కాలంలో ఓటీటీలోకి వచ్చి మంచి ఆదరణ పొందిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్లో ప్లాన్ చేసుకోండి మరి.
లంబసింగి (Lambasingi)
బిగ్‌బాస్ ఫేమ్ దివి.. హీరోయిన్గా చేసిన చిత్రం ‘లంబసింగి’. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మార్చి 15న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 2న హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చి ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కానిస్టేబుల్ వీరబాబు.. నర్సు హరితను ప్రేమిస్తాడు. ఆమె.. నక్సలైట్ల లీడర్ కోనప్ప కూతురని వీరబాబుకు తెలుస్తుంది. ఓ రోజు కోనప్ప నేతృత్వంలోని దళం వీరబాబు పనిచేసే పోలీసుస్టేషన్‌పై దాడి చేస్తుంది. ఆ దళంలో హరిత కూడా ఉండటంతో వీరబాబు షాకవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
తంత్ర (Tantra)
అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన హార్రర్ థ్రిల్లర్ తంత్ర.. ఏప్రిల్ 5 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. రేఖ (అనన్య)కు దెయ్యాలు కనిపిస్తుంటాయి. బాల్య స్నేహితుడు తేజూను ఆమె ఇష్టపడటంతో ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? విగత (వంశీ), రాజేశ్వరి (సలోని) పాత్రలతో రేఖకు సంబంధం ఏంటి? అన్నది కథ.
కథ వెనుక కథ (Katha Venuka Katha)
విశ్వంత్ దుడ్డుంపూడి హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన ‘కథ వెనుక కథ‘ చిత్రం ఓటీటీలో మంచి వ్యూస్ సాధిస్తోంది. మార్చి 28 నుంచి ఈటీవీ యాప్ (ETV App)లో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ చిత్రం వీక్షకుల చేత ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే.. సినిమా డైరెక్టర్ కావాలనుకున్న ఓ యువకుడి కథ ఇది. తాను తీసిన సినిమాలోని నటీనటులంతా విడుదలకు ముందు ఒక్కొక్కరిగా మిస్ అవుతుంటారు. అందులో ఒక యాక్టర్ మరణిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు తెలుస్తాయి. ఇంతకు నటీనటులు ఎలా మిస్ అయ్యారు. విచారణలో తేలిన సంచలన విషయాలు ఏమిటి అనేది మిగతా కథ
హను మాన్ (Hanu Man)
టాలీవుడ్ సెన్సేషన్ ‘హను మాన్’ కూడా ఇటీవల ఓటీటీలో విడుదలై అక్కడ కూడా ప్రభంజనం సృష్టించింది. మార్చి 17న ‘జీ5’ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన హనుమాన్.. అంచనాలను అందుకుంటూ కొన్ని గంటల్లోనే మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించింది. కథలోకి వెళ్తే.. మేఖైల్ చిన్నప్పటి నుంచి సూపర్ హీరో కావాలని భావిస్తుంటాడు. మరోవైపు అంజనాద్రి గ్రామంలో హనుమంతు అనే యువకుడు.. కొన్ని అనూహ్య పరిణామాలతో అంజనేయస్వామి శక్తులు పొందుతాడు. ఆ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? హనుమంతు పవర్స్ గురించి మైఖేల్ ఏం చేశాడు? అన్నది కథ.
అన్వేషిప్పిన్ కండెతుమ్ (Anweshippin Kandethum)
ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అత్యధిక వీక్షణలతో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ మూవీకి డార్విన్ కురియకోస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ.
లూటేరే (Lootere)
ఇటీవల కాలంలో వచ్చిన వెబ్ సిరీస్‌లలో ‘లూటేరే’ టాప్‌లో ఉందని చెప్పవచ్చు. ఇది సముద్రపు దొంగలు, షిప్ హైజాక్ నేపథ్యంలో తెరకెక్కింది. జై మెహతా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా మార్చి 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 2017లో చోటుచేసుకున్న యదార్థ సంఘటన ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. భారత దేశానికి చెందిన ఇండియన్ కార్గో షిప్‌ను సోమాలియాకు చెందిన సముద్రపు దొంగలు హైజాక్ చేస్తారు. అందులోని సిబ్బందిని బందీలుగా చేసుకొని 5కోట్ల డాలర్లను డిమాండ్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? బంధీలుగా ఉన్నావారు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది కథ.
మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా! (Masthu Shades Unnai Ra)
హాస్యనటుడు అభినవ్ గోమఠం హీరోగా నటించిన తాజా చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా‘. ఈ సినిమా కూడా మార్చి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ లభిస్తుండటం విశేషం. ఇక కథ విషయానికి వస్తే.. మనోహర్ (అభినవ్ గోమఠం) సాధారణ పెయింటర్. ఓ కారణం చేత ఫోటోషాప్ నేర్చుకుని ఫ్లెక్స్ డిజైనింగ్ యూనిట్ సొంతంగా పెట్టుకోవాలని అనుకుంటాడు. చేతిలో రూపాయి లేని మనోహర్ ఈ ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరికి ఎలా విజయం సాధించాడు? అన్నది కథ.
మర్డర్ ముబారక్ (Murder Mubarak)
ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సారా అలీఖాన్, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, విజయ్ వర్మ, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు హోమి అదాజానియా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. రాయల్ ఢిల్లీ క్లబ్లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్ రంగంలోకి దిగుతాడు. క్లబ్లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్), నటి షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్), రాయల్ రన్విజయ్ (సంజయ్ కపూర్), లాయర్ ఆకాష్ (విజయ్ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ.
కాజల్ కార్తిక (Kajal Karthika)
కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా నటించిన హార్రర్ థ్రిల్లర్ ‘కాజల్ కార్తిక‘. ఏప్రిల్ 9 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌లోకి రానుంది. థియేటర్లలో రిలీజై దాదాపు ఏడాది గడిచిన తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. కార్తీక (రెజీనా).. కాలక్షేపం కోసం ఓ పాత లైబ్రరీకి వెళ్లి అక్కడ వందేళ్ల నాటి పుస్తకాన్ని చదువుతుంది. అందులోని ఐదు దయ్యాల పాత్రలు ఒక్కొక్కటిగా కళ్ల ముందుకు వస్తుంటాయి. అలా వచ్చిన కార్తిక (కాజల్) ఎవరు? ఆమె మరణానికి గ్రామస్తులు ఎందుకు కారణమయ్యారు? మిగిలిన నాలుగు దెయ్యాల పాత్రలు ఏంటి? అన్నది కథ.
ప్రేమలు (Premalu)
మలయాళం సెన్సేషన్ ప్రేమలు.. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 12 నుంచి డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వస్తోంది. ఈ చిత్రం తెలుగులో రూ.15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఈ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా కథ ఏంటంటే.. సచిన్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటికే లవ్‌లో ఫెయిలైన సచిన్.. రీనూకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవరు? సచిన్ – రీనూ చివరకు కలిశారా? లేదా? అన్నది కథ.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది