2013 తర్వాత టీమిండియా ఏకంగా 8 ఐసీసీ ట్రోఫీలను నాకౌట్స్‌లో కోల్పోయింది. కొన్నింట్లో తుది వరకు వచ్చి ఓడిపోతే, మరికొన్నింట్లో మొదట్లోనే చేతులెత్తేసింది. 2014లో టీ20 వరల్డ్‌కప్‌లో మొదలైన పరాభవ ప్రస్థానం.. నిన్న మొన్నటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు కొనసాగింది. నాకౌట్స్‌లో పేలవ ఆట తీరుతో టీమిండియా అభిమానులకు నిరాశే మిగుల్చుతోంది. 2013 తర్వాత భారత్ ఇప్పటివరకు కోల్పోయిన ఐసీసీ ట్రోఫీలేంటో చూద్దాం.
2014 టీ20 వరల్డ్‌కప్..
గ్రూప్ దశలో ఓటమే ఎరుగకుండా నాకౌట్స్‌లోకి ప్రవేశించింది భారత్. సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాను మట్టికరిపించి ఫైనల్‌లో అడుగు పెట్టింది. తుది సమరంలో శ్రీలంకతో భారత్ పోటీ పడింది. ధోనీ సేన మరోసారి కప్పు కొడుతుందనే భావించారంతా. కానీ, ఫైనల్‌లో పూర్తిగా తేలిపోయింది. కేవలం 130 పరుగులే చేసి.. ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయింది. దీంతో కప్పు చేజారింది.
2015 వన్డే వరల్డ్‌కప్..
2011 వన్డే వరల్డ్‌కప్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది భారత్. 2015లో ఇరు జట్లు సెమీఫైనల్ పోరులో తలపడ్డాయి. తొలుత 328 పరుగుల భారీ టార్గెట్‌ని నిర్దేశించింది ఆస్ట్రేలియా. అప్పటివరకు టోర్నీలో ఒక్క మ్యాచులోనూ ఓడని టీమిండియా ఇందులోనూ గెలుస్తుందనే భావించారు. కానీ, మునపటి తీరును రిపీట్ చేస్తూ 233కే ఆలౌటైంది. దీంతో సెమీఫైనల్‌లోనే వెనుదిరగాల్సి వచ్చింది.
2016 టీ20 వరల్డ్‌కప్..
2014లో శ్రీలంక చేతిలో ఓటమిని జీర్ణించుకోలేని టీమిండియా 2016లో మళ్ళీ ఫైనల్ వేటకు సిద్ధమైంది. కానీ, అనూహ్యంగా సెమీఫైనల్ మ్యాచులోనే వెనుదిరగాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 192 పరుగులు చేసినప్పటికీ టార్గెట్‌ని కాపాడుకోలేక పోయింది. మరో 2 బంతులు మిగిలి ఉండగానే కరేబియన్లకు గెలుపును అప్పగించింది. ఇలా 2016లోనూ ఫ్యాన్స్ ఆశలు నీరుగారాయి.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ..
2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోరంగా కంగుతింది. ఏకంగా 180 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. పాకిస్థాన్ 338 పరుగులు చేయగా భారత్ 158కే ఆలౌటై ట్రోఫీని చేజార్చుకుంది.
2019 వన్డే వరల్డ్ కప్..
న్యూజిలాండ్ చేతిలో సెమీఫైనల్‌లో ఓడిపోయి ఇండియా ఇంటిముఖం పట్టింది. కివీస్ జట్టు విధించిన 240 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించలేక పోయింది. 221 పరుగులకే ఆలౌటైంది. 2015 తర్వాత మరోసారి సెమీఫైనల్‌లోనే వెనుదిరిగింది.
2021 టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్
న్యూజిలాండ్‌తో మొదటి టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసి 219 పరుగులకే ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్‌ని 249పరుగులకు కట్టడి చేసింది. కానీ, రెండో ఇన్నింగ్సులోనూ భారత్ తడబడింది. ఈ సారి 179 రన్స్‌కే చాప చుట్టేసి కివీస్‌కు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 140 పరుగులు చేసి విజేతగా అవతరించింది.
2022 టీ20 వరల్డ్‌కప్
2022 టీ20 వరల్డ్‌కప్‌లోనూ టీమిండియా చేతులెత్తేసింది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ ముందు తలవంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో వికెట్ కోల్పోకుండా ఇంగ్లాండ్ టార్గెట్‌ని ఛేదించి ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. భారత్‌ను ఇంటికి పంపించింది.
2023 డబ్ల్యూటీసీ ఫైనల్..
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మెరుగ్గా రాణిస్తూ టీమిండియా మరోసారి ఫైనల్‌కు చేరుకుంది. కానీ, ఇక్కడా పాత సీన్‌నే రిపీట్ చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్సులో ఆసీస్‌ని కట్టడి చేయలేకపోయింది. చెమటోడ్చి 469 పరుగులకు కంగారూలను ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగి 296 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్సులోనూ ఆసీస్ 270 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కానీ, 444 పరుగు లక్ష్యాన్ని ఛేదించలేక 234 రన్స్‌కే చాప చుట్టేసి రెండోసారి రన్నరప్‌గా నిలిచింది.