ఐపీఎల్-2023 తుది దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన చెన్నై, గుజరాత్, ముంబయి జట్లు టైటిల్ రేసులో నిలిచాయి. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఫైనల్ చేరింది. గుజరాత్-ముంబయి మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తుదిపోరులో చైన్నెతో తలపడుతుంది. అయితే ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా ముంబయి, చెన్నైకి పేరుంది. టైటిల్ పోరు మరింత రసవత్తరంగా మారాలంటే పైనల్స్ ముంబయి వెళ్లాల్సిందేనని ఐపీఎల్ అభిమానులు కోరుకుంటున్నారు. అశ్విన్ వంటి స్టార్ క్రికెటర్లు సైతం బహిరంగంగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫైనల్స్‌కు ముంబయి వెళితే మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతుంది? చెన్నై, ముంబయి ట్రాక్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
చెన్నై VS ముంబయి
ఐపీఎల్ టైటిల్స్
ఐపీఎల్‌లో చెన్నై, ముంబయి ట్రాక్ రికార్డు ఘనంగానే ఉన్నాయి. ఇప్పటివరకూ 12 సీజన్లు ఆడిన చెన్నై (నిషేధం వల్ల రెండు సీజన్లు ఆడలేదు) పదింటిలో ఫైనల్స్ చేరిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ చెన్నై నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలవగా, ముంబయి ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా చెన్నై, ముంబయిని పిలుస్తారు.
ముంబయిదే పైచేయి
ఐపీఎల్ లీగ్, ప్లేఆఫ్ దశల్లో అద్భుత ఫామ్ కనబరిచే చెన్నై.. ఫైనల్స్‌కు వచ్చే సరికీ తడబడుతుంటుంది. అందువల్లే 9 సార్లు (2008,10,11,12,13,15,18, 19 & 2021) ఫైనల్స్ చేరినప్పటికీ నాలుగు టైటిల్స్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫైనల్స్ వచ్చిన ఐదు ఓటముల్లో మూడు ముంబయి చేతిలోవే. ఇక ముంబయికి మాత్రం ఫైనల్స్‌లో మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకూ ఆరు సార్లు ఆ జట్టు ఫైనల్స్‌కు వెళ్లగా ఐదుసార్లు కప్పు గెలిచింది.
లీగ్ దశలోనూ ముంబయిదే హవా
ఐపీఎల్‌లో చెన్నైపై ముంబయికి మంచి గణాంకాలే ఉన్నాయి. చెన్నైతో పోలిస్తే ముంబయికే ఎక్కువ సక్సెస్ రేటు ఉంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఇప్పటివరకూ ముంబయి, చెన్నై జట్లు 34 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబయి 20 మ్యాచుల్లో గెలవగా, చెన్నై 14 మ్యాచుల్లో విజయం సాధించింది.
ధోని vs రోహిత్
ఐపీఎల్‌లో ఏ లెక్కన చూసిన ధోనిపై రోహిత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. రోహిత్ సారథ్యంలోని ముంబయిని ఎదుర్కొన్న ప్రతీసారి ధోని లెక్కలు తప్పుతున్నాయి. ఫైనల్స్‌లో మూడుసార్లు ధోనిని, రోహిత్ సేన ఓడించిన విషయం తెలిసిందే. ఫిక్సింగ్, బెట్టింగ్ కారణంగా చెన్నై రెండేళ్లు నిషేధానికి గురి కాగా.. అప్పుడు ఫైనల్‌కు చేరిన పుణేను కూడా రోహిత్ ఓడించాడు. అప్పుడు పుణే టీమ్‌లో ధోనీ భాగంగా ఉన్నాడు.
చెన్నై ఫేవరెట్
ఇప్పటివరకూ ఐపీఎల్ గణంకాలు ఎలా ఉన్నా ఈసారి చెన్నై చాలా బలంగా కనిపిస్తోంది. ముంబయి ఫైనల్స్ వస్తే చెన్నైనే ఫేవరేట్‌గా ఉంటుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చెన్నై అన్ని రంగాల్లో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతీ విషయంలో చెన్నై సంతృప్తికరంగా ఉంది. ఇటు ముంబయి బ్యాటింగ్ దుర్భేధ్యంగా ఉన్నప్పటికీ చెన్నైతో పోలిస్తే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంది. గత రెండు మ్యాచుల్లో పేసర్ ఆకాశ్ మధ్వాల్ అద్భుతంగా బౌలింగ్ వేసినప్పటికీ, మిగిలిన వారు దారాళంగా పరుగులు సమర్పిస్తుండటం రోహిత్ సేనకు సమస్యగా మారింది. ఫైనల్స్‌లో ఎలాంటి తప్పులు చేయని జట్టు విజేతగా నిలుస్తుంది.
గుజరాత్ వర్సెస్ చెన్నై
ఇక గుజరాత్ టైటాన్స్‌కు కూడా ఫైనల్ చేరే ఛాన్సెస్ మెండుగానే ఉన్నాయి. క్వాలిఫైయర్-1లో ఓడినంత మాత్రాన ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ప్రస్తుతం గుజరాత్ అన్ని రంగాల్లో ఎంతో సమతూకంగా ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయిని ఓడిస్తే హార్దిక్ సేన నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. అక్కడ చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఢీకొడుతుంది. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్ల మధ్య గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హెడ్ టూ హెడ్ రికార్డ్
గతేడాది ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌కు చెన్నైపై మంచి గణాంకాలే ఉన్నాయి. ఇప్పటివరకూ నాలుగు మ్యాచుల్లో ఇరు జట్లు తలపడగా గుజరాత్ మూడింటిలో గెలిచింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో గెలవడం ద్వారా గుజరాత్‌పై చెన్నై తొలి విజయాన్ని నమోదు చేసింది.
సమతూకం
ఇక బౌలింగ్, బ్యాటింగ్ విషయానికి వస్తే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ సమతూకంగా ఉన్నాయి. గుజరాత్ బ్యాటర్ శుభమన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. చెన్నై ఓపెనర్స్ భారీగా భాగస్వామ్యాలు నమోదు చేస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెస్తున్నారు. అటు రషీద్ ఖాన్, షమీలతో గుజరాత్ బౌలింగ్ స్ట్రాంగ్‌గా ఉండగా, దీపక్ చాహార్, రవీంద్ర జడేజా, మహీషా పతిరణలతో చెన్నై బౌలింగ్ మెప్పిస్తోంది.
గురుశిష్యుల సవాల్
ధోని, హార్దిక్‌లది గురుశిష్యుల బంధం. ఇప్పటికే క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గురువైన ధోనిపై పై చేయి సాధించగా, గుజరాత్ ఫైనల్స్ వస్తే పోరు రసవత్తరంగా మారుతుందని చెప్పొచ్చు. అయితే గుజరాత్ బ్యాటర్ గిల్‌ను చెన్నై కట్టడి చేయగల్గితే మ్యాచ్‌పై పట్టుసాధించే అవకాశముంది. ఈ రెండు జట్ల మధ్య ఫలితాన్ని అంచనా వేయడం కష్టమే అయినప్పటికీ.. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్స్ జరగడం GTకి కలిసిరానుంది. తుది పోరులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్టు విజేతగా నిలవనుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!