• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Konidela Pawan Kalyan Ane Nenu: బాహుబలిని తలపించిన పవన్‌ ప్రమాణ స్వీకారం.. ఆనందంతో ఉప్పొంగిన చిరంజీవి!

  అంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ – జనసేన – భాజపా ముఖ్యనేతలు, సినీ ప్రముఖులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముందుగా నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఒక్కొక్కరుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ‘పవన్‌ అనే నేను’.. అంటూ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అపూర్వమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

  బాహుబలి రేంజ్‌లో..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన నూతన మంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పవన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి నిలుచుని చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. జయజయ ధ్వానాలతో ప్రాంగణం మారుమోగిపోయేలా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘పవన్‌ అనే నేను’ అని జనసేనాని అనగానే సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. బాహుబలి సినిమాలో ప్రభాస్‌ సర్వ సైన్యాధ్యాక్షుడిగా ప్రమాణం చేసే సన్నివేశాన్ని ఈ ఘటన గుర్తు చేసింది. 

  చిరు.. ఆనంద బాష్పాలు

  పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తన తమ్ముడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని భావిస్తూ ఆనందంతో ఉప్పొంగారు. కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం పవన్‌ వేదికపై ఉన్న అతిథులందరికీ అభివాదం చేశారు. ఆపై సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించారు. తాను ఎంత ఎదిగిన అన్న ముందు చిన్నవాడినేనన్న విధంగా చిరు పట్ల తనకున్న కృతజ్ఞతను తెలియజేశారు. అనంతరం చిరు.. పవన్‌ను ప్రేమగా దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం సభా ప్రాంగణంలోని వారందరినీ ఉద్వేగానికి గురి చేసింది. 

  అపూర్వ కలయిక

  ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. మరో గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవిని ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు ప్రధాని మోదీ వద్దకు వెళ్లిన పవన్‌.. తన అన్న గురించి ప్రస్తావించారు. దీంతో వెంటనే మెగాస్టార్‌ను గమనించిన మోదీ.. స్వయంగా పవన్‌తో కలిసి అతడి వద్దకు వెళ్లారు. కొద్దిసేపు చిరంజీవితో ముచ్చటించారు. అనంతరం మెగా బ్రదర్స్‌ చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణమంతా మరోమారు హర్షధ్వానాలతో మారుమోగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మెగా ఫ్యాన్స్‌ వైరల్ చేస్తున్నారు. 

  అతిథుల కోలాహలం

  చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth) ముఖ్య అతిథి హోదాలో చిరు పక్కన స్టేజీపైన కూర్చున్నారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నారా లోకేశ్‌ భార్య, బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణితో రామ్‌చరణ్‌ కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలిచి.. కార్యక్రమంలో సందడి చేశారు. యంగ్‌ హీరోలు నిఖిల్‌, నారా రోహిత్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. 

  23 మందితో నూతన మంత్రివర్గం

  ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా.. పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ సహా మెుత్తం 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెదేపా నుంచి 19 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురు, భాజపా నుంచి ఒకరు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. సగానికిపైగా కొత్తవారికి అవకాశం లభించింది. ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రిపదవి కల్పించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv