సాధారణంగా హీరో పాత్రలు ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ఉంటాయి. యాక్షన్ చిత్రాల్లో ఒకలా.. సోషియోఫాంటసీ జానర్స్‌లో మరోలా ఉంటాయి. చాలా వరకూ సినిమాల్లో హీరో పాత్రను సాధారణ ప్రేక్షకులు ఓన్ చేసుకోలేరు. ఎందుకంటే ఆ చిత్రాల్లో వారు కలర్‌ఫుల్ డ్రెస్‌లు వెసుకుంటూ కార్లల్లో తిరుగుతుంటారు. హైఫై జీవితాలను గడుపుతుంటారు. అయితే కొన్ని సినిమాలు అలా కాదు. అవి మధ్యతరగతి కుటుంబాలకు చాలా దగ్గరగా ఉంటాయి. మిడిల్ క్లాస్ జీవితాలను కళ్లకు కడతాయి. ఆ సినిమాల్లో హీరో ఎలాంటి హంగులు లేకుండా కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు. అందుకే సమాజంలోని మెజారిటీ యూత్ ఆ హీరో పాత్రలను ఓన్ చేసుకుంటారు. తమను తాము తెరపై చూసుకుంటున్నట్లు భావిస్తారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన టాప్ మిడిల్ క్లాస్ హీరో పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఈ (Aadavari Matalaku Arthale Verule) సినిమాలో హీరో వెంకటేష్ (Venkatesh) సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఉద్యోగం లేక తండ్రి కోటా శ్రీనివాస్ చేత చివాట్లు తింటూ ఉంటాడు. చివరికీ ఉద్యోగం రావడంతో తండ్రిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఓ కారణం చేత తండ్రిని కోల్పోయి అనాథగా మారతాడు. ఇలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మిడిల్ క్లాస్ జీవితాలను గుర్తు చేస్తూనే ఉంటుంది.
రఘువరన్ బీటెక్
ఈ (Raghuvaran Btech) సినిమాలో రఘువరన్ (ధనుష్) కుటుంబం కోసం ఏదోటి కోల్పోతూనే ఉంటాడు. ఓ అవసరం కోసం దాచుకున్న డబ్బును తమ్ముడికి ఇచ్చేస్తాడు. తల్లి చనిపోవడంతో ఇష్టం లేని ఉద్యోగానికి ఇంటర్యూలకు తిరుగుతాడు.
తమ్ముడు
ఈ (Thammudu) సినిమాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తొలుత ఆకతాయి తనంగా ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఉంటాడు. బాక్సింగ్ పోటీలకు సిద్దమైన అన్నపై అతడి ప్రత్యర్థులు దాడి చేయడంతో పవన్‌లో మార్పు వస్తుంది. అన్న కోసం జల్సా జీవితాన్ని వదులుకొని ఎంతో కష్టపడి బాక్సింగ్ నేర్చుకుంటాడు. అన్నను ఆస్పత్రిపాలు చేసిన విలన్‌కు బాక్సింగ్ కోర్టులో బుద్ది చెప్తాడు.
అలా వైకుంఠపురంలో
ఇందులో (Ala Vaikunthapurramuloo) అల్లు అర్జున్ కోటీశ్వరుడు. మురళిశర్మ చేసిన కుట్రతో అతడే తండ్రి అని నమ్మి చిన్నప్పటి నుంచి అతడి ఇంట్లోనే పెరుగుతాడు. అతడి భార్యను తల్లిగా, కూతుర్ని సొంత చెల్లెలని భావిస్తాడు. పెద్దయ్యాక తనెవరో నిజం తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న అసలైన తల్లిదండ్రులను కాపాడతాడు. కానీ వారికి నిజం చెప్పడు. మిడిల్ క్లాస్ జీవితాన్నే గడిపేందుకు ఇష్టపడతాడు.
గ్యాంగ్ లీడర్
గ్యాంగ్‌లీడర్‌లో (Gang Leader) చిరంజీవి (Chiranjeevi) తొలుత ఖాళీగా తిరుగుతుంటాడు. పెద్దన్న మరణంతో రెండో అన్న చదువు బాధ్యత తనపై వేసుకుంటాడు. డబ్బు కోసం ఓ కేసులో జైలుకు సైతం వెళ్తాడు. అలా తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు.
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి
ఈ (Amma Nanna O Tamila Ammayi) సినిమాలో రవితేజ (Ravi Teja)కు తన తండ్రి ప్రకాష్ రాజ్ అంటే అసలు పడదు. తన తల్లిని వదిలేశాడని కోపంతో ఉంటాడు. అనుకోకుండా తల్లి చనిపోవడంతో ఆమె ఆఖరి కోరిక మేరకు బాక్సింగ్ కోచ్ అయిన తండ్రి దగ్గరకు వెళ్తాడు. విలన్ తన తండ్రిని, సవతి చెల్లిని మోసం చేశాడని తెలుసుకొని బాక్సింగ్ కోర్టులో తలపడి అతడికి బుద్ధి చెప్తాడు.
అ ఆ
ఇందులో (A Aa) నితిన్ (Nithin) పక్కా మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఉంటాడు. రావురమేష్‌కి తన ఫ్యామిలీ అప్పు ఉండటంతో ఇష్టం లేకపోయినా అతడి కూతుర్ని చేసుకునేందుకు సిద్ధపడతాడు. కోటీశ్వరురాలైన అత్త కూతురు సమంత ప్రేమిస్తోందని తెలిసినప్పటికీ క్లైమాక్స్ వరకూ కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటాడు.
జెర్సీ (Jersey)
క్రికెటర్ అయినా నాని (Nani) అనారోగ్య కారణంతో ఆటకు దూరమవుతాడు. రైల్వే ఉద్యోగం కోల్పోయి భార్య సంపాదనపై ఆధారపడి జీవిస్తుంటాడు. క్రికెటర్‌గా చూడాలని కొడుకు చెప్పడంతో తిరిగి బ్యాట్ పట్టుకుంటాడు. ఒక మధ్యతరగతి తండ్రి కొడుకును ఎంతగా ప్రేమిస్తాడో ఈ సినిమాలో నాని చూపించాడు.
నేనింతే
ఈ (Neninthe) సినిమాలో రవితేజ (Ravi Teja).. సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించలేని స్థితిలో ఉంటాడు. ఓ వైపు లక్ష్యం.. మరోవైపు తల్లి ఆరోగ్యం మధ్య అతడు పడే సంఘర్షణ చాలా మంది జీవితాలను ప్రతిబింబిస్తుంది.
యోగి
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన యోగి (Yogi) చిత్రం మిడిల్ క్లాస్ యువతకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. డబ్బుకోసం తల్లిని విడిచి నగరానికి వచ్చిన హీరో ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడు. రూపాయి రూపాయి కూడగట్టి తల్లికి గాజులు చేయిస్తాడు. అయితే ఆ గాజులు వేసుకోకుండానే తల్లి చనిపోవడం చాలా మందికి తమ గతాన్ని గుర్తు చేస్తుంది.