జూ.ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేసింది. విలన్‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించారు. అయితే ‘దేవర’ మూవీ తారక్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్‌కు సాధ్యం కానీ విజయాన్ని తారక్‌కు అందించింది. అటు ఫ్లాప్ దర్శకులకు తారక్ ఓ వరమని మరోమారు నిరూపించింది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఫ్లాప్ డైరెక్టర్లతో హిట్స్!
టాలీవుడ్‌లోని ఫ్లాప్ డైరెక్టర్స్ పాలిట జూ.ఎన్టీఆర్ ఓ దేవుడిలా మారాడని చెప్పవచ్చు. భారీ డిజాస్టర్‌తో ఫేమ్ కోల్పోయిన డైరెక్టర్లు తారక్‌తో ఓ సినిమా చేస్తే మునుపటి క్రేజ్‌ను తిరిగి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. రీసెంట్‌గా దేవర విషయంలోనూ ఇదే నిరూపితమైంది. దర్శకుడు కొరటాల శివ గతంలో తీసిన ‘ఆచార్య’ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అసలు కొరటాల శివ చిత్రమేనా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటువంటి డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చి దేవరతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు తారక్. అంతకుముందు ఫ్లాప్‌లతో ఉన్న పూరి జగన్నాథ్‌కు ‘టెంపర్’తో సక్సెస్ ఇచ్చాడు. ‘1: నేనొక్కడినే’ పరాజయంతో ఢీలా పడిపోయిన సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ మూవీ తీసి గాడిలో పెట్టాడు. రవితేజతో ఫ్లాప్ అందుకున్న బాబీకి ‘జై లవకుశ’తో మంచి హిట్ ఇచ్చాడు. ‘అజ్ఞాతవాసి’తో భారీ డిజాస్టర్ అందుకున్న త్రివిక్రమ్‌కు ‘అరవింద సామెత’తో సక్సెస్ అందించాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు వరుసగా హిట్స్ ఇచ్చి సరికొత్త రికార్డును తారక్ క్రియేట్ చేస్తున్నాడు.
ఒకే ఒక్క హీరోగా తారక్
హీరోల కెరీర్‌లో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సర్వ సాధారణం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తీసిన ప్రతీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ సైతం బాహుబలి తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాలతో ఫ్లాప్ అందుకున్న వాడే. అయితే తారక్ మాత్రం గత తొమ్మిదేళ్లుగా ఒక్క ఫ్లాప్ లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన గత 7 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్స్‌గా నిలిచాయి. ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’, ‘RRR’, ‘దేవర’ వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఈ జనరేషన్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా తారక్ నిలవడం విశేషం. ఫ్యూచర్‌లో ‘దేవర 2’, ప్రశాంత్ నీల్‌తో ‘NTR 31’, సందీప్ రెడ్డి వంగాతో ఓ చిత్రం (గాసిప్) వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఉండటంతో తారక్ జైత్రయాత్ర ఇకపైనా కొనసాగే అవకాశముంది.
23 ఏళ్ల ఫ్లాప్ రికార్డు బద్దలు
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేస్తే బ్లాక్ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా వెంటనే హిట్ కొట్టిన దాఖలాలు లేవు. అయితే ‘దేవర’తో తారక్ ఈ ఫ్లాప్ సెంటిమంట్‌ను బీట్ చేశాడు. రాజమౌళితో ‘RRR’ చేసిన తారక్ వెంటనే ‘దేవర’తో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి ఫస్ట్ ఫిల్మ్ ‘స్టూడెంట్ నెం.1’తో ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌కు శ్రీకారం చుట్టిన తారక్ స్వయంగా తానే దీనిని బ్రేక్ చేయడం విశేషం. అది కూడా 23 క్రితం స్టూడెంట్ నెం.1 రిలీజైన రోజున దేవరను తీసుకొచ్చి రాజమౌళి సెంటిమెంట్‌ను బద్దలు కొట్టాడు.
రైతు పాత్రలో తారక్!
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
హీరోయిన్‌గా రష్మిక?
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.