అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున (Akkineni Nagarjuna) ఏ హీరో చేయనన్నీ ప్రయోగాలు తనపై తాను చేసుకున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా వైవిధ్యమైన చిత్రాలతో కెరీర్‌లో ముందుకు సాగారు. మాస్, క్లాస్, ఆధ్యాత్మికం, లవ్ ఇలా అన్ని జానర్స్‌లో చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసులుగా తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్‌ను సైతం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తండ్రిగానూ సక్సెస్ అయ్యారు. ఇండస్ట్రీలో నాగార్జున సక్సెస్ వెనుక కొన్ని డేరింగ్ స్టెప్స్ ఉన్నాయి. ఇవాళ (ఆగస్టు 29) నాగార్జున బర్త్‌డే సందర్భంగా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
‘శివ’తో సెన్సేషన్
సాధారణంగా కెరీర్ తొలినాళ్లలో ఏ హీరో అయినా సేఫ్ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు. అయితే నాగార్జున ‘శివ’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కనీసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయని రామ్‌గోపాల్ వర్మకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి గొప్ప సాహసమే చేశారు. నాగార్జున వేసిన ఆ డేరింగ్ స్టెప్ అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎవరూ ఊహించిన విధంగా ‘శివ’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాగ్ కెరీర్‌తో పాటు టాలీవుడ్ దిశను కూడా శివ పూర్తిగా మార్చేసింది. హీరో అంటే ఇలాగే ఉండాలన్న మూసధోరణికి ‘శివ’తో నాగ్ – రామ్‌గోపాల్ వర్మ చెక్ పెట్టారు.
వైవిధ్యతకు ప్రాధాన్యం
శివ సినిమాతో నాగార్జున ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారిపోయాడు. అప్పట్లో ఒక సినిమా హిట్ అయ్యిందంటే అదే ప్యాట్రన్‌లో చాలా కథలు వచ్చి పడేవి. అయితే నాగార్జున వాటికి తలొగ్గకుండా సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘గోవిందా గోవిందా’లాంటి సూపర్ నేచురల్ హెయిస్ట్ ఫిల్మ్, ‘నిన్నే పెళ్లాడతా’ వంటి ఫ్యామిలీ డ్రామా, ‘హలో బ్రదర్’లాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ఫ్యాన్స్‌ను అలరించారు. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు.
‘అన్నమయ్య’
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలు కమర్షియల్ చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో నాగార్జున ‘అన్నమయ్య’ ప్రాజెక్ట్‌ను ఓకే చేసి అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటికే మాస్ ఇమేజ్ తెచ్చుకున్న నాగార్జున డివోషనల్ చిత్రం చేయడమేంటని ఇండస్ట్రీలో విమర్శలు వచ్చాయి. నటుడు అంటే అన్ని రకాల పాత్రలు వేయాలన్న సిద్ధాంతాన్ని నమ్మిన నాగార్జున ఏమాత్రం సంకోచించకుండా అన్నమయ్య సినిమాలో నటించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నాగార్జున తన నటనతో నిజమైన అన్నమయ్యను గుర్తుచేశారు. ఈ చిత్రానికి ఏకంగా రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ రావడం విశేషం.
మరిన్ని ఆధ్యాత్మిక చిత్రాలు..
‘అన్నమయ్య’ సక్సెస్‌తో నాగార్జున సరిపెట్టుకోలేదు. ఓవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరిన్ని భక్తిరస సినిమాల్లో ఆయన నటించారు. రాఘవేంద్రరావు-నాగార్జున కాంబోలో వచ్చిన ‘రామదాసు’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలాగే ‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’, ‘జగద్గురు ఆది శంకర’ వంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో నాగార్జున మెరిశారు.
కొత్తవారికి ఛాన్స్..
కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో రిస్కే కాదు, విజయమూ ఉందని ఎన్నోసార్లు నిరూపించారు నాగార్జున. సుదీర్ఘ నట ప్రస్థానంలో సుమారు 40 మంది దర్శకులను ఆయన టాలీవుడ్‌కి పరిచయం చేశారు. రామ్‌గోపాల్ వర్మ (శివ), వైవీఎస్ చౌదరి (శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి), లారెన్స్ (మాస్), విజయ్ బిన్నీ (నా సామిరంగ) తదితరులు ఆ జాబితాలోకే వస్తారు. తాను స్టార్ కావడానికి కారణం ఓ రకంగా నూతన దర్శకులే అంటుంటారు నాగ్.
తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్
తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలను మార్చిన హీరోగా నాగార్జునను చెబుతుంటారు. ఈ విషయంపై డైరెక్టర్ కృష్ణవంశీ ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను గ్లోబల్ చేసిన హీరో నాగార్జున అని కొనియాడారు. ఇతర ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లను తీసుకొచ్చి తన సొంత డబ్బుతో వైవిధ్యమైన చిత్రాలు నిర్మించారని గుర్తుచేశారు. తద్వారా ఆడియన్స్ విజన్‌ను నాగార్జున మార్చేశారని పేర్కొన్నారు. మణిరత్నం, ప్రియదర్శన్, ఫాజిల్, రవిచందర్, మహేష్ భట్ ఇలా మలయాళం, కన్నడ, హిందీ, తమిళ ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లతో నాగార్జున వర్క్ చేశారని గుర్తుచేశారు. చిన్న క్యారెక్టర్ అయినా బాంబే వెళ్లి వచ్చేవారని పేర్కొన్నారు. పాన్ ఇండియా అనే మాటకు మెుదట ఫౌండేషన్ వేసిందే నాగార్జున అని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ హోస్ట్‌గా..
సాధారణంగా స్టార్‌డమ్ వచ్చిన హీరోలు బుల్లితెర షోలలో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి కనిపించరు. వారి దృష్టంతా సినిమాలపైనే ఉంటుంది. అయితే నాగార్జున అలా కాదు. బిగ్‌బాస్ తెలుగు షోకు గత కొన్నేళ్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఎన్టీఆర్, తారక్ వంటి కుర్ర హీరోలు ఒక సీజన్‌కు మాత్రమే పరిమితం కాగా నాగ్ మాత్రం అలవోకగా సీజన్‌లపైన సీజన్‌లు చేసుకుంటూ వెళ్తున్నారు. వరుసగా ఐదు సీజన్ల (Bigg Boss 3,4,5,6,7)కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సెప్టెంబరు 1న ప్రారంభం కానున్న 8వ సీజన్‌కూ ఆయనే వ్యాఖ్యాత. అంతేకాదు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహించడం గమనార్హం.
ఫిట్‌నెస్ మంత్ర
నాగార్జున ఫిట్‌నెస్‌ను చూసి కుర్ర హీరోలు సైతం షాకవుతుంటారు. శివ సమయంలో నాగ్ ఫిజిక్ ఎలా ఉందో ఇప్పటికే అదే బాడీని మెయిన్‌టెన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం, వర్కౌట్ చేయడమే తన అందం సీక్రెట్ అంటూ పలు వేదికల్లో నాగార్జున చెప్పుకుంటా వచ్చారు. 1986లో ‘విక్రమ్’(Vikram)తో హీరోగా పరిచయమైన నాగ్ వంద చిత్రాలకు చేరుకున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ (Kubera)లో నటిస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్