సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఆరెంజ్ (Orange)
రామ్‌చరణ్ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.
అ! (Awe)
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు.
C/o కంచరపాలెం (C/o Kancharapalem)
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది.
అంటే సుందరానికి (Ante Sundaraniki)
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.
కర్మ (Karma)
యంగ్ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.
1: నేనొక్కడినే (1: Nenokkadine)
సుకుమార్ – మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.
ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)
ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.
ఖలేజా (Khaleja)
ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్ హీరో – హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు… క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.
విరాట పర్వం
సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘రిపబ్లిక్‘. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘మెంటల్ మదిలో‘ (2017) సినిమా కూడా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం