దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఆయన.. మహేష్‌తో SSMB29తో గ్లోబల్ మార్కెట్‌ను శాంసించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో రాణించగల డైరెక్టర్లు తెలుగులో ఉన్నారా అన్న సందేహాన్ని నార్త్ ఆడియన్స్ వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా పలువురు డైనమిక్ డైరెక్టర్స్ కనిపిస్తున్నారు. రాజమౌళి బాటలోనే నడుస్తూ.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారి ముందున్న అవకాశాలు ఏంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.
Contents
నాగ్ అశ్విన్ (Nag Ashwin)
ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్ పేరు ‘నాగ్ అశ్విన్’. ప్రభాస్ హీరోగా అతడు తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై గ్లోబల్ స్థాయిలో బజ్ ఉంది. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోన్న ఈ సినిమా.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే నాగ్ అశ్విన్‌కు కెరీర్ పరంగా తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా టాలీవుడ్ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లి.. నాగ్ అశ్విన్‌కు ఎనలేని ఫేమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. పైగా నాగ్ అశ్విన్.. విజన్, ఎగ్జిక్యూషన్, యునిక్ ప్రమోషన్స్ చూస్తే అచ్చం రాజమౌళి గుర్తుకు రాక మానడు.
టెక్నాలజీని సినిమాకు అన్వయించడంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడు ముందుంటాడు. ప్రపంచస్థాయి గ్రాఫిక్స్, కొత్త తరహా ఆయుధాలు, వినూత్నమైన కాస్ట్యూమ్స్, వైవిధ్యమైన డైలాగ్స్, నెవర్‌బీఫోర్ హీరో ఎలివేషన్స్ ఇలా ప్రతీ అంశంలోనూ తన మార్క్ చూపిస్తుంటాడు. అయితే కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ విషయంలో రాజమౌళిని గుర్తు చేస్తున్నాడు. కల్కి కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ కోసం ఓ స్పెషల్ వెహికల్‌ను చిత్ర యూనిట్ తయారు చేయించింది. సినిమాలో ‘బుజ్జి’ అని పిలిచే ఈ రోబోటిక్ వాహనంతోనే హీరో ప్రభాస్ అడ్వెంచర్స్ చేశాడు. బుజ్జికి సంబంధించి బుధవారం (మే 22) స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా అది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
బుజ్జి అనే స్పెషల్ వెహికల్‌ని మూవీ టీమ్ మహీంద్రా కంపెనీతో కలిసి తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సాధారణంగా ఏదైనా కొత్త వెహికల్‌ను తయారు చేయడానికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. మహీంద్రా టీమ్‌ను సినిమాలో భాగంగా చేసుకొని తమ ఆలోచనలకు అనుగుణంగా వారిని డైరెక్ట్ చేస్తూ వెహికల్‌ను తయారు చేయించుకున్నారు. ఈ సినిమాలో బుజ్జికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందని నాగ్ అశ్విన్.. గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో అన్నారు. వెహికల్ తయారీకి సహకరించిన ఆనంద్ మహీంద్ర టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.
సుకుమార్ (Sukumar)
‘పుష్ప’ (Pushpa : The Rise) సినిమా ముందు వరకూ టాలీవుడ్‌కే పరిమితమైన సుకుమార్.. ఆ మూవీ తర్వాత ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో సుకుమార్ దర్శకత్వ నైపుణ్యం చూసి ప్రతీ ఒక్కరు ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టైలిష్ హీరోను.. ఎలాంటి మేకప్ లేకుండా మాసిన జుట్టు, గడ్డంతో చూపించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే కథకు తగ్గట్లు బన్నీ రూపురేఖలు మార్చి అక్కడే సినిమా విజయానికి పునాది వేశారు సుకుమార్. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. సాలిడ్ ఇంటర్వెల్ ద్వారా సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తాడు. అటు సినిమా ముగింపును కూడా ఆడియన్స్‌కు చాలా సంతృప్తి కలిగేలా రాజమౌళి తీర్చిదిద్దుతాడు. అయితే డైరెక్టర్ సుకుమార్ దీనికి పూర్తి డిఫరెంట్ ఫార్మూలను పుష్ప విషయంలో అనుసరించారు. ఇందులో ఎలాంటి రక్తపాతం లేకుండా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లను డిజైన్ చేశారు. పుష్ప.. మంగళం శీను (సునీల్) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో సెకండాఫ్‌పై హైప్ క్రియేట్ చేశారు సుకుమార్. అటు క్లైమాక్స్‌లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)కు పుష్ప చేత సవాలు విసిరించి.. రెండో పార్ట్‌పై ఆసక్తిని రగిలించారు.
ప్రస్తుతం సుకుమార్ రూపొందిస్తున్న పుష్ప సీక్వెల్ ‘పుష్ప 2 : ది రూల్’ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుండగా.. మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేశారు. ఈ సినిమా విజయం సాధిస్తే సుకుమార్ స్థాయి మరింత పెరగనుంది. పైగా తన తర్వాతి చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. అటు ‘పుష్ప 3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి నెక్స్ట్ 2, 3 ఏళ్లలో సుకుమార్.. రాజమౌళి రేంజ్‌లో పాపులర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)
టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ‘యానిమల్’ (Animal) సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సందీప్.. రాజమౌళిలాగా సినిమా మేకింగ్ స్టైల్‌నే మార్చేశాడు. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్ సాహించని విధంగా సినిమాలు తీస్తూ అలరిస్తున్నాడు. సందీప్ తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్‌తో తీయనున్నాడు. దీనికి స్పిరిట్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అతడి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ప్రభాస్ వేసుకున్న పోలీసు డ్రెస్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంటర్‌నేషనల్ కాప్ లుక్‌ను తలపిస్తోంది. యానిమల్ కంటే స్ట్రాంగ్ కంటెంట్‌తో స్పిరిట్ రానుంది ఇప్పటికే సందీప్ ప్రకటించాడు. తొలి రోజే రూ.150 కోట్ల వసూళ్లను రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మూవీ హిట్ టాక్ వస్తే.. వారం రోజుల్లోనే రూ.1500 కలెక్షన్లు సాధిస్తుందని సందీప్ వంగా నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది.
ఇక స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి.. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)తోనే ‘యానిమల్ 2’ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే సందీప్‌కు రాజమౌళి స్థాయిలో ఫేమ్ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రశాంత్ వర్మ (Prasanth Varma)
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన టాలెంట్ ఏంటో ‘హనుమాన్’ (HanuMan) ద్వారా యావత్ దేశానికి తెలియజేశాడు. తన మూడో సినిమాతోనే స్టార్ డైరెక్టర్ల సరసన నిలబడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హనుమాన్ నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ కొలగొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ.. ‘హనుమాన్ 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)తో ఓ పీరియాడికల్ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్‌కు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ అయితే ప్రశాంత్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగడం ఖాయం.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel)
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. టాలీవుడ్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ (Salaar) రూపొందించి సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడి మేకింగ్ స్టైల్ రాజమౌళిని సైతం ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ ఎలివేషన్స్ ఇచ్చి.. ప్రతీ ఒక్కరినీ ప్రశాంత్ నీల్ ఆకట్టుకున్నారు. హీరో ప్రభాస్‌ను చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీగా సలార్‌లో ప్రొజెక్ట్ చేశాడు డైరెక్టర్. రాజమౌళి తరహాలోనే అద్భుతంగా ఇంటర్వెల్‌ను డిజైన్ చేశాడు. ప్రభాస్‌ను స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వచ్చాయి.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఫోకస్ మెుత్తం ‘సలార్ 2’ (Salaar: Part 2 – Shouryanga Parvam)పై ఉంది. ఈ మూవీ కూడా విజయం సాధిస్తే ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయిలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోవడం ఖాయం. అటు తారక్‌తోనూ ప్రశాంత్.. ఓ సినిమాను ప్రకటించాడు. ‘NTR31’ ప్రొడక్షన్ టైటిల్‌తో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు ‘కేజీఎఫ్ 3’ రూపొందనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టులు సక్సెస్ అయితే ప్రశాంత్ క్రేజ్ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముంది.
కొరటాల శివ (Koratala Siva)
టాలీవుడ్ టాలెంటెడ్ డైెరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్య మినహా ఇప్పటివరకూ అతడు డైరెక్ట్ చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అతడు కెరీర్‌లో తొలిసారి ఓ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తారక్‌తో ‘దేవర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ రానుండగా తొలి భాగం.. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తారక్‌తో పాటు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో రిలీజ్ చేసిన దేవర గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ గ్లింప్‌లో తారక్.. కత్తితో శత్రువులను తెగనరకడం చూపించాడు డైరెక్టర్. ఓ సీన్‌లో తారక్ శత్రువుని నరకగా అతడి రక్తం.. హాఫ్ మూన్‌ను కింద వైపు నుంచి ఈక్వెల్‌గా రౌండ్ చేయడం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అలాగే ఇటీవల తారక్ బర్త్‌డేను పురస్కరించుకొని రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కూడా సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ముఖ్యంగా తారక్ పాత్రను ఎలివేట్ చేస్తూ రాసుకున్న లిరిక్స్ హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీ సక్సెస్ అయితే కొరటాల శివ క్రేజ్ జాతీయ స్థాయికి చేరనుంది. ఇక దేవర రెండు పార్ట్స్ కూడా విజయం సాధిస్తే.. దేశంలోని ప్రముఖ డైరెక్టర్ల జాబితాలో అతడు చేరడం ఖాయం.
సుజీత్ (Sujeeth)
యంగ్ డైరెక్టర్ సుజీత్.. స్టైలిష్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో పేరుంది. అతడి డైరెక్షన్ స్కిల్స్ రాజమౌళి తరహాలోనే హాలీవుడ్ డైరెక్టర్లను తలపిస్తాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ చిత్రానికి
సుజీత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సుజీత్ మేకింగ్ నైపుణ్యం, స్క్రీన్‌ప్లే, ఐడియాలజీకి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఆయన తెరకెక్కించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్‌ను చాలా స్టైలిష్‌గా చూపించాడు. సరైన హిట్ లభిస్తే సుజీత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో ‘ఓజీ’ (OG) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ సక్సెస్ అయితే సుజీత్ కెరీర్ మరోలా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా. రెండు సాలిడ్ హిట్స్ పడితే అతడి క్రేజ్ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముందని విశ్లేషణలు ఉన్నాయి.
బుచ్చిబాబు (Buchi Babu)
తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్న అతికొద్ది దర్శకుల్లో బుచ్చిబాబు ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అతడు.. తనలో ఎంతో టాలెంట్ ఉందని ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. తన తర్వాతి చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్‌తో చేసే స్థాయికి ఎదిగాడు. స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. రామ్‌చరణ్ క్రేజ్‌కు బుచ్చిబాబు టాలెంట్ తోడైతే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగుతుందని అభిప్రాయపడుతున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్