రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ మూవీ గురించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని కల్ట్ మూవీగా విజయ్ అభివర్ణించాడు. “కల్ట్ వ్యక్తులతో కల్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. దానిని మీతో పంచుకుంటున్నాం” అంటూ మైక్ టైసన్ తో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. దీంతో పూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టాలీవుడ్ లో మరో ట్రెండ్ సెట్టర్ గా నిలవనుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. అసలు ఇప్పటి వరకు తెలగులో యాక్షన్ చిత్రాల్లో కల్ట్ మూవీలు అనదగ్గవి ఏవి? నిజంగా లైగర్ కల్ట్ మూవీ అయ్యే అవకాశం ఉందా? ఓసారి చూద్దాం.
కల్ట్ మూవీ అంటే?
కల్ట్ మూవీకి పర్యాయ పదంగా ట్రెండ్ సెట్టర్ సినిమా అని కూడా సినీ విశ్లేషకులు పిలుస్తారు. విభిన్న కథాంశం. విడుదలయ్యాక ఆ మూవీ పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ సంపాదించడం, ఆ చిత్రం పంథాను కొన్నేళ్లపాటు మరికొన్ని సినిమాలు అనుసరించి రావడం, ఆ సినిమా డైలాగ్స్.. ఇప్పటికీ జనాల నాలుకలపై నానడం వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలు ఈ కోవలోకే వస్తాయి.
90వ దశకం నుంచి యాక్షన్ కల్ట్ మూవీలు
శివ(1989)
ఎలాంటి అంచనాలు లేకుండా 1989లో రిలీజైన ‘శివ’ మూవీ ఇండస్ట్రీ కల్ట్ గా నిలిచింది. అప్పటి వరకు సామాజిక ఆర్థిక అంశాలే ప్రధానం రూపొందిన చిత్రాల పంథాను ఒక్కసారిగా మార్చింది. పక్క యాక్షన్ మూవీగా తెరకెక్కిన శివ నాగార్జునకు స్టార్ డామ్ తెచ్చిపెట్టింది. ఆయన కెరీర్ గ్రాఫ్ ను అమాంతం పెంచేసింది. నాగార్జున పట్ల యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సైకిల్ చైన్ లాగే మెనరిజాన్ని అప్పట్లో యూత్ పిచ్చిగా ఫాలో అయ్యేవారు. ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మతో మూవీలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కట్టారు. అంతే కాదు శివ యాక్షన్ సిక్వెన్స్ ను అనుసరిస్తూ చాలా చిత్రాలు వచ్చాయి.
గాయం(1993)
1993లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లోనే వచ్చిన ‘గాయం’ సైతం మంచి యాక్షన్ కల్ట్ గా నిలిచింది. ఈ మూవీని యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పెరొందిన జగపతి బాబు ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ లుక్ లోకి మారిపోయారు. దుర్గ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. జగపతి బాబు సరసన రేవతి, కోటా శ్రీనివాస్ రావు, సిరివెన్నెల సితారామశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని’ అనే పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిందే.
భారతీయుడు(1996)
శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు ఆల్ టైమ్ యాక్షన్ కల్ట్ చిత్రంగా పేరొందింది. రొటీన్ మూవీలకు భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా సరికొత్త కథాంశంతో శంకర్ తెరకెక్కించాడు. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ తర్వాత ఇదే తరహా కథాంశాలతో వచ్చిన రమణ, ఠాగూర్, మల్లన్న చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ లో మెప్పించాడు. మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించాడు.
సమరసింహా రెడ్డి(1999)
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన ‘సమరసింహా రెడ్డి(1999), నరసింహా నాయుడు(2001) యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ కు కొత్త నిర్వచనం అందించాయి. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రాల్ని డెరెక్టర్ బీ గోపాల్ అద్భుతంగా తెరకెక్కించాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. ఈ చిత్రాల్లో బాలయ్య డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసింది. ఈ రెండు సినిమాలను అనుకరిస్తూ వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. ఫాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఇంద్ర, ఆది, యజ్ఞం మూవీలు హిట్ కొట్టాయి.
పోకిరి(2006)
తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ కల్ట్ మూవీ పోకిరి(2006). అప్పటివరకు తెలుగు తెరకు పరిచయం లేని గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ తో పూరి ముందుకొచ్చాడు. పోకిరి దెబ్బకు అన్ని రికార్డులు దాసోహం అయ్యాయి. హీరో మేనరిజం, డెలాగ్స్, చిత్రీకరణ విలువలు, మణిశర్మ మ్యూజిక్ ప్రతి ఒక్కటీ వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు పోకిరి యాక్షన్ సిక్వెన్స్ ను ఫాలో అయ్యాయి.
మగధీర(2009)
రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర క్లాసిక్ కల్ట్ గా చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను మగధీర బ్రేక్ చేసింది. పూర్వ జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ చాల ఏళ్ల తర్వాత మళ్లీ పౌరాణిక వాసనను తెలుగు తెరకు గుర్తు చేసింది. కత్తులు, యుద్ధం వంటి యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మంచి బ్రెక్ ఇచ్చింది. నటించిన రెండో సినిమాతోనే చరణ్ కు స్టార్ హోదా దక్కింది. ఈ చిత్రం పోలికలతో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఆశించినంత విజయం సాధించలేదు.
అర్జున్ రెడ్డి(2017)
కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి డెరెక్ట్ చేసిన ‘అర్జున్ రెడ్డి(2017)’ టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం పెద్దఎ త్తున ఫ్యాన్ బేస్ సంపాదించింది. విజయ్ దేవరకొండ కేరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాను హిందీ, తమిళ్ ఇండస్ట్రీల్లో రీమేక్ చేశారు. యూత్ లో ఫుల్ జోష్ ను నింపింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ ని రౌడీ బాయ్ అంటూ అభిమానులు పిలవడం మొదలు పెట్టారు.
బాహుబలి-2(2017)
రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కావ్యం ‘బాహుబలి-2(2017)’ భారత చలనచిత్ర గతినే మార్చింది. అన్ని భాషలను ఏకం చేసి పాన్ ఇండియా ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లోనే సాధ్యమనుకునే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ రికార్డును బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులే కాదు సౌత్ సినిమాలను పెద్దగా ఆదరించని నార్త్ ఆడియన్స్ మనసులను సైతం కొల్లగొట్టింది.
సౌత్, నార్త్ కాదు మన సినిమా ఇండియన్ సినిమా అనే స్థాయికి ఇండస్ట్రీ వర్గాలను తీసుకొచ్చింది. ఈ మూవీ తర్వాత పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా మూవీలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
పుష్ప(2022)
ఈ ఏడాది పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘పుష్ప’ భారీ విజయాన్ని సాధించింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అల్లు అర్జున్ కేరీర్ లో బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా డైలాగులను రాజకీయ నాయకులు మొదలు క్రికెటర్లు, WWE స్టార్ల వరకు వల్లవేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అయితే.. రాజకీయ నాయకులు ‘తగ్గేదేలే’.. ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది.
లైగర్ కల్ట్ మూవీగా నిలవనుందా?
పాన్ ఇండియా మూవీగా లైగర్ ను డైరెక్ట్ చేస్తున్న పూరి జగన్నాథ్ ఇప్పటికే పలు ట్రెండ్ సెట్టర్ మూవీలను తెరకెక్కించాడు. మాస్ ఆడియన్స్ నాడి ఎలా పట్టాలో పూరికి బాగా తెలుసు. రవితేజతో ఇడియట్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోకిరి వంటి కల్ట్ మూవీలు తీసి ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు. అలాగే కిక్ బాక్సింగ్ స్టోరి కూడా పూరికి కొత్తకాదు. ఈ కథాంశంతో గతంలో తీసిన అమ్మనాన్న ఓ తమిళమ్మాయి సూపర్ హిట్ అయ్యింది.
ఇక లైగర్ విషయానికి వస్తే యూనిక్ స్టోరీతో సినిమా డైరెక్ట్ చేస్తున్నట్లు పూరీ పలు సందర్భాల్లో తెలిపాడు. లైగర్ లో విజయ్ యాక్షన్ చూసి తనకు దిమ్మతిరిగిందని ‘రోమాంటిక్’ మూవీ ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు. తాను ఊహించినదానికంటే అద్భుతంగా మూవీ తెరకెక్కుతోందని పేర్కొన్నాడు. ఆ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ విడుదలైన లైగర్ ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అలాగే మైక్ టైసన్, విజయ్ ఫేస్ లతో కలపి రిలీజ్ చేసిన ఫొటోలు నెట్టింట్లో అభిమానుల మధ్య చర్చకు దారితీశాయి. సినిమా స్టోరీ లైన్ ను పలు రకాలుగా ఊహిస్తున్నారు. లైగర్ లో మైక్ టైసన్ విజయ్ కి తండ్రి అని అంచనా వేస్తున్నారు. అదే కథలో ట్విస్ట్ అని అందుకే సినిమా టైటిల్ కు లైగర్ పెట్టారని కామెంట్ చేస్తున్నారు.
లైగర్ పై హాలీవుడ్ దృష్టి
లైగర్ లో మైక్ టైసన్ నటిస్తుండటంతో హాలీవుడ్ మీడియా సైతం ఈ చిత్రంపై దృష్టి పెట్టింది. హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన రాకీ మూవీతో చాలా మంది పోలుస్తున్నారు. 1976లో రిలీజ్ అయిన ఈ చిత్రం హాలీవుడ్ లో కల్ట్ మూవీగా నిలిచింది. అలాగే 2004లో విడుదలైన మిలియన్ డాలర్ బేబీ కూడా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ సాధించింది.
నా సర్వస్వం అర్పించా
విజయ్ సైతం ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. లైగర్ కోసం తన సర్వస్వం సమర్పించినట్లు పేర్కొన్నాడు. ‘నా సర్వస్వం తీసుకున్న సినిమా ఇది, నటన పరంగా, మానసికంగా, శారీరకంగా ఇది నా మోస్ట్ ఛాలెంజింగ్ రోల్’ అంటూ గులాబీ పూలతో కవర్ చేస్తూ తన ఫొటోను ట్వీట్ చేశాడు.
ఇప్పటికే అర్జున్ రెడ్డి వంటి ట్రెండ్ సెట్టర్ మూవీతో స్టార్ హోదాకు ఎదిగిన విజయ్…. తాను చెప్పినట్లుగా లైగర్ మరో కల్ట్ మూవీగా నిలిస్తే.. విజయ్ ఇక తన కెరీర్ లోవెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అని ఫ్యాన్స్ అంటున్నారు. లైగర్ పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ గా నిలవాలని ఆశిస్తున్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?