• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్‌ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?

    నెపోటిజం అనేది సినీ పరిశ్రమలో ఎప్పుడు చర్చనీయాంశమే. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత నెపోటిజంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటీనటుల వల్ల ఇతరులకు అవకాశాలు లభించడం లేదన్న కామెంట్స్‌ పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే వారసత్వం అనేది సినీ పరిశ్రమలో కామన్‌గా మారిపోయింది. ఇందుకు టాలీవుడ్‌ ఏమి అతీతం కాదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌ తర్వాత ఆ స్థాయిలో వారసత్వం ద్వారా వచ్చిన హీరోలు మన ఇండస్ట్రీలోనే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో నాని, విజయ్‌ దేవరకొండ, నితీన్‌, అడివిశేష్‌, శర్వానంద్‌, గోపిచంద్‌ తదితరులు ‘టైర్‌ 2’ హీరోలుగా మిగిలిపోతున్నారన్న వాదనలు ఉన్నాయి. అందులో వాస్తవమెంతా? నెపోటిజం వల్లే వారు రాణించలేకపోతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    అసలు ‘టైర్‌-2’ అంటే ఏంటి?

    సాధారణంగా ప్రతీ ఇండస్ట్రీలోనూ హీరో, హీరోయిన్లను వారికి ఉన్న క్రేజ్‌ను బట్టి రెండు లేదా మూడు రకాలుగా విడదీస్తారు. టాలీవుడ్‌కు వచ్చేసరికి ప్రభాస్‌ (Prabhas), రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (Jr NTR), అల్లు అర్జున్‌ (Allu Arjun), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), మహేష్‌బాబు (Mahesh Babu), చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) వంటి వారిని టైర్‌-1 హీరోలుగా ఇండస్ట్రీ వర్గాలు, సినీ విశ్లేషకులు లెక్కగడతారు. ఎందుకంటే వారి సినిమా రిలీజ్‌ అవుతుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. తొలి రోజే దాదాపు 30 నుంచి 50 శాతం బడ్జెట్‌ వసూలవుతుంది. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉండటంతో వారిని అగ్ర శ్రేణి నటులుగా దర్శకులు, నిర్మాతలు లెక్కగడతారు. టైర్‌ 2 విషయానికి వస్తే పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లు ఈ జాబితాలో నాని, విజయ్‌ దేవరకొండ, నితిన్‌, రామ్‌ పోతినేని, నాగచైతన్య, గోపిచంద్‌ వంటి వారు ఉంటారు. అగ్రహీరోల రెమ్యూనరేషన్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, సినిమాల బడ్జెట్‌ పరంగా చూస్తే వీరు కాస్త వెనకబడి ఉంటారు. అగ్ర హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ వీరి చిత్రాల కలెక్షన్స్ పరిమితంగానే ఉంటాయి. 

    కన్నెత్తి చూడని స్టార్‌ డైరెక్టర్స్‌!

    రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌, కొరటాల శివ వంటి స్టార్‌ డైరెక్టర్లు అగ్ర హీరోలతోనే సినిమాలు చేసేందుకు అసక్తి కనబరుస్తున్నారు. దీనివల్ల విజయ్‌ దేవరకొండ, నాని వంటి స్టార్‌ హీరోలకు అన్యాయం జరుగుతోందని వారి ఫ్యాన్స్‌ అంటున్నారు. స్టార్ డైరెక్టర్స్‌ తమ హీరోలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల వారు పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కాలేకపోతున్నట్లు చెబుతున్నారు. కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. హీరో నాని ‘సరిపోదా శనివారం’ విషయంలో ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు. పాన్ఇండియా స్థాయిలో ‘సరిపోదా శనివారం’ రిలీజ్‌ని ప్లాన్‌ చేసినా ఇప్పటికీ హిందీలో విడుదల కాలేదు. టాలీవుడ్‌ దాటి స్టార్‌ డమ్‌ లేకపోవడం వల్ల టాలెంట్‌ ఉన్నా కూడా నానికి మైనస్‌గా మారుతోందని ఫ్యాన్స్ అంటున్నారు. 

    కథలు సైతం వెళ్లడం లేదా?

    ఒక సినిమాలో ఎంత మంచి తారాగణం ఉన్నప్పటికీ సరైన కథ లేకుంటే ఆ సినిమా ఆడటం కష్టం. ఒక సినిమా సక్సెస్సా? ఫెయిల్యూరా? అనేది డిసైడ్‌ చేసేది స్టోరీనే. అయితే ఇటీవల ‘టైర్‌ 2’ హీరోల చిత్రాలు చూస్తుంటే స్టోరీలు సరిగా వినే చేస్తున్నారా అన్న ప్రశ్న ఫ్యాన్స్‌ నుంచి ఎదురవుతోంది. ఇటీవల రామ్ పోతినేని చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’, నితిన్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, గోపిచంద్‌ ‘రామబాణం’ సినిమాలు అసలు ఎందుకు ఒప్పుకున్నారో కూడా ఫ్యాన్స్‌కు అర్థం కాని పరిస్థితి. అయితే పాన్‌ ఇండియా స్థాయి స్క్రిప్ట్స్‌ పెద్ద హీరోల వద్దకే వెళ్లిపోతుండటంతో ఇలా ‘టైర్‌ 2’ హీరోలు వచ్చిన కథలతో సంతృప్తి పడాల్సి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

    నెపోటిజం vs టాలెంట్‌!

    అయితే వారసత్వం ఉంటేనే సినిమాల్లోనే రాణిస్తారనేది పూర్తిగా అవాస్తవం. అలా అయితే పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ స్టార్‌ హీరోలు అయిపోయేవారు కదా. ఎంత పెద్ద సినీ నేపథ్యమున్నా యాక్టింగ్‌ టాలెంట్ లేకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో మనుగడ సాగించలేరు. ఇది చాలా మంది వారసత్వ నటుల విషయంలో నిరూపితమైంది. నాని, విజయ్‌ దేవరకొండ, రవితేజ, సిద్దు జొన్నలగడ్డ, అడివి శేష్‌, నవీన్‌ పోలిశెట్టి వంటి నటులు ఎలాంటి నేపథ్యం లేకుండానే వచ్చి ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తున్నారు. వారిలో టాలెంట్‌ ఉంది కాబట్టే ఇదంతా సాధ్యమైంది. హీరో నాని ఇంకో భారీ విజయం లభిస్తే టైర్‌-1 హీరో స్థాయికి ఎదగడం పక్కా అన్న ప్రచారం జరుగుతోంది. 

    తప్పు ప్రేక్షకుల్లో ఉంది!

    గతంలో ఓ ఇంటర్యూలో పాల్గొన్న నటులు రానా, నాని నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా రానా మాట్లాడుతూ వారసత్వం వల్ల వచ్చే బరువు, బాధ్యతలు అందరికీ తెలియవని అన్నారు. నెపోటిజం అన్నది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందని టాలెంట్ లేకపోతే సినీ ఇండస్ట్రీలో నెట్టుకురావడం కుదరదని రానా తేల్చి చెప్పాడు. నెపోటిజంపై మరో యంగ్ హీరో నాని మాట్లాడుతూ నెపోటిజాన్ని సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు ఫాలో కావడం లేదని, సినిమాలు చూసే ప్రేక్షకులే దాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. తాను చేసిన మొదటి సినిమాని లక్ష మంది ప్రేక్షకులు మాత్రమే చూశారని, అదే చరణ్ చేసిన మొదటి సినిమాని కోటి మంది చూశారని చెప్పారు. మరి చూసిన ప్రేక్షకులే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోందని నాని ప్రశ్నించాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv