• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?

    టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్‌ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్‌ హీరోలు ఫ్లాప్స్‌ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.

    ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం!

    టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్‌, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్‌ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌ వంటి స్టార్‌ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్‌ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్‌ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్‌, మైథాలజీ, ఫ్యూచరిక్‌ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్‌ (దేవర), రామ్‌చరణ్‌ (గేమ్‌ ఛేంజర్‌), అల్లు అర్జున్‌ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్‌ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది. 

    ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు!

    యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్‌ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్‌ హిట్‌ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్‌ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్‌ నటించిన రీసెంట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్‌’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్‌’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని చేసిన లేటెస్ట్‌ చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్‌’, ‘రెడ్‌’ సినిమాలు హిట్స్‌ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి.

    మార్కెట్‌ కోల్పోయే దిశగా సీనియర్లు

    ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్‌ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్‌’, ‘విక్రమ్‌’ సినిమాలతో సాలిడ్‌ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్‌ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్‌ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్‌ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్‌ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

    ప్రభాస్‌, నాని సూపర్బ్‌!

    గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్‌, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్‌ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 & 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ‘రాజాసాబ్‌’, సలార్‌ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్‌’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి. 

    రీరిలీజ్‌లతో ఫ్యాన్స్‌ సంతృప్తి!

    గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్‌ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలకు లాంగ్‌ గ్యాప్‌ వస్తుండటంతో రీరిలీజ్‌ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్‌ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్‌ రూపంలో తమ ఫేవరేట్‌ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. 

    ఆ స్టార్‌ డైరెక్టర్లకు ఏమైంది?

    టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్‌ మ్యాన్‌’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్‌’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అటు హరీష్‌ శంకర్‌ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి సూపర్‌ హిట్స్‌తో మాస్‌ డైరెక్టర్‌గా హరీష్‌ శంకర్‌ ఇటీవల సరైన హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్‌’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్‌ బచ్చన్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్‌ శంకర్‌ టేకింగ్‌ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv